నాగార్జున సాగర్ లో నామినేషన్ల పర్వం తుది ఘట్టానికి చేరటంతో ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. టీఆర్ఎస్ తరుపున నోముల తనయుడు భగత్ కు ఆపార్టీ నుంచి బరిలో ఉన్నారు. ప్రచారంలో తనతో పాటు కేటీఆర్ కూడా పాల్గొంటారని కేసీఆర్ తెలిపారు. ఇక కాంగ్రెస్ నుండి జానారెడ్డి ప్రచారంలో ముందున్నారు. ఇప్పటికే హాలియాలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ కూడా నిర్వహించింది. అయితే, ఈ సభకు రేవంత్ రెడ్డి హజరుకాలేదు. కరోనా సోకటం వల్ల ఆయన సభకు రాలేకపోయారు. దీంతో ఉపఎన్నిక ప్రచారానికి రేవంత్ వస్తారా? లేదా ? అన్న అనుమానం వ్యక్తం అయింది. అయితే, తాజాగా రేవంత్ సాగర్ ప్రచారానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కరోనా నుండి కోలుకుంటున్న రేవంత్ రెడ్డి… సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఏప్రిల్ 8 నుండి నాలుగైదు రోజుల పాటు రేవంత్ అక్కడే మకాం వేయనున్నారని తెలుస్తోంది. నియోజకవర్గంలోని ప్రతి మండలాన్ని కవర్ అయ్యేలా ఆయన ప్రచారం నిర్వహించబోతున్నారు. రేవంత్ రావటం ఖాయం కావటంతో… ఆయన రూట్ మ్యాప్ ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఎక్కడ ప్రచారం చేయాలనే అంశంపై జానారెడ్డి, రేవంత్ రెడ్డి ఇప్పటికే చర్చించినట్లు సమాచారం.