Friday, November 22, 2024

అలకలు వీడండి.. కలిసి పని చేద్దాం!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న రేవంత్ రెడ్డి వరుసగా పార్టీ సీనియర్ నాయకులతో భేటీలు అవుతున్నారు. ఇందులో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మర్రి శశిధర్​రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రేపు జరుగనున్న ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. కొన్ని రోజులుగా భట్టిని కలిసేందుకు రేవంత్​రెడ్డి ప్రయత్నించగా… నిరాకరిస్తూ వచ్చారు. మంగళవారం ఉదయం మాజీ ఎంపీ మల్లు రవితో చర్చల అనంతరం.. భట్టిని రేవంత్​ కలిశారు. పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాలని భట్టితో పాటు పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిని రేవంత్​ ఆహ్వానించారు. అపారమైన అనుభవం, కాంగ్రెస్ పార్టీ ఎన్నో సేవలు అందించిన మర్రి శశిధర్ రెడ్డి సలహాలతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని రేవంత్​ తెలిపారు. సమష్టి నిర్ణయంతో ముందుకు వెళతామని పేర్కొన్నారు

టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్​ను నియమించటంపై పార్టీలోని కొందరు సీనియర్లు వ్యతిరేకించగా… వారందరిని మల్లు రవి బుజ్జగించారు. పలువురు సీనియర్లను కలసి.. రేవంత్​కు మద్దతివ్వాలని స్వయంగా కోరారు. టీపీసీసీగా శ్రీధర్​ బాబుకి అవకాశం ఇవ్వాలని భట్టి కోరగా.. మల్లురవి రేవంత్​కు మద్దతిచ్చాడు. చివరికి అధిష్ఠానం కూడా రేవంత్​కే మొగ్గుచూపటం వల్ల భట్టి కొంత అసంతృప్తిలో ఉన్నారు. ఆ విషయంపైనే రేవంత్​ను కలిసేందుకు ఇన్ని రోజులు విముఖత చూపించారు. అయితే, మల్లు రవి చర్చలు అనంతరం భట్టి రేవంత్ ను కలిశారు.

కాంగ్రెస్ పార్టీని అందరం కలసికట్టుగా అధికారంలోకి తీసుకు వచ్చి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లక్ష్యాలను చేరుకోవాలని  ఈ సందర్భంగా భట్టి అన్నారు. కొత్తగా పీసీసీ బాధ్యతలు అందుకుంటున్న రేవంత్ రెడ్డి.. పార్టీ అధ్యక్షుడిగా విజయవంతం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. పార్టీలో కిందిస్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుడి వరకు అందరిని రేవంత్ రెడ్డి కలుపుకుని ముందుకుపోవాలని భట్టి సూచించారు.

ఇది కూడా చదవండి: 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలుగు వారికి ప్రాధాన్యం!

Advertisement

తాజా వార్తలు

Advertisement