తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఉన్న ఎర్రవెల్లి గ్రామంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు పిలుపునిచ్చిన ‘రచ్చబండ’ కార్యక్రమంపై హైటెన్షన్ కొనసాగుతోంది. ‘రచ్చబండ’ కార్యక్రమానికి పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ నేతల ఎర్రవల్లి పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని గృహనిర్బంధం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిని తెల్లవారుజామున పోలీసులు చుట్టుముట్టారు. ఆయన వెళ్లకుండా ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
గజ్వేల్ నియోజకవర్గంలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవల్లిలో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో 150 ఎకరాల్లో వరి పండిస్తున్న ఆంశాన్ని మీడియాకు చూపిస్తున్నాని ఆదివారం రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అర్థరాత్రి నుంచే పోలీసులు రేవంత్ ఇంటిని ముట్టడించి ఆయన బయటకు రాకుండా అడ్డుకున్నారు. అయితే, ఎలాగైనా రచ్చబండ నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ శ్రేణులు పట్టుబడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడు అరెస్టులు చేస్తున్నారు. చాలామంది నేతల ఇళ్ల ముందు సోమవారం తెల్లవారుజాము నుంచే పహారా కాస్తూ వారందరిని హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, మధుయాష్కీ, సంపత్ కుమార్ ఇళ్ల వద్ద కూడా పోలీసులను మోహరించారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని గృహ నిర్బంధం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..