విద్యుత్ చార్జీల పెంపు, ధాన్యం కొనుగోలు పోరాటంలో భాగంగా నేడు విద్యుత్ సౌధ, సివిల్ సప్లైస్ భవనాల ముట్టడికి తెలంగాణ కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. టీపీసీసీ రేవంత్‌రెడ్డిని గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఆయన బయటకు రాకుండా అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో అక్కడ పోలీసులు మోహరించారు. రేవంత్ రెడ్డి ఇంటి వైపు ఉన్న రోడ్ల వద్ద బారికేడ్లు పెట్టి దిగ్బంధం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ వరుస ఉద్యమాలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఈ రోజు విద్యుత్ సౌధ, సివిల్ సప్లై కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.