దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లివచ్చిన వారు క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కుంభమేళా నుంచి ఢిల్లీకి వచ్చినవారు 14 రోజులపాటు తప్పనిసరిగా హోంక్వారంటైన్ లో ఉండాలని స్పష్టం చేసింది. ఏప్రిల్ 4 నుంచి 17 వరకు వెళ్లి వచ్చిన వారు లేదా నేటి నుంచి ఈనెల చివరి నాటికి కుంభమేళాకు వెళ్లివచ్చేవారు 24 గంటల్లోగా వివరాలు ప్రభుత్వానికి సమర్పించాలని పేర్కొంది. ఒకవేళ కుంభమేళాకు వెళ్లినప్పటికీ సమాచారం అందించలేదని తెలిసినట్లతే ప్రభుత్వ క్వారంటైన్ కు తరలిస్తామని వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్ దేవ్ స్పష్టం చేశారు.
మరోవైపు ఢిల్లీలో గత 24 గంటల్లో కొత్తగా 24,375 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 8 లక్షల 28 వేలకు చేరింది. ఇప్పటివరకూ 11,793 మంది మహమ్మారి బారిన పడి మృతి చెందారు.