Tuesday, November 19, 2024

రిప‌బ్లిక్ డే: ప‌లువురికి రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాలు, పతకాలు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో విశేష ప్రతిభ, ధైర్యసాహసాలు, ప్రజలు ప్రాణాలు కాపాడే క్రమంలో విశిష్ట సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి అందజేసే రాష్ట్రపతి ప్రతిభా పురస్కారాలు, ఇతర పతకాలను కేంద్రం ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ), కస్టమ్స్ విభాగంలో 29 మంది అధికారులు రాష్ట్రపతి పతకాలకు ఎంపికయ్యారు. విశాఖపట్నం జోనల్ యూనిట్ (డైరక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్)లో సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డబ్ల్యూ.డీ. చంద్రశేఖర్, ఢిల్లీ కస్టమ్స్ (ప్రివెంటివ్) విభాగంలో సూపరింటెండెంట్ వీణా రావు, విశాఖపట్నంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కొటిక్స్ లో అదనపు అసిస్టెంట్ డైరక్టర్ కర్రి వెంకట మోహన రావు వంటి తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారులు సహా వివిధ రాష్ట్రాల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మరికొందరు అధికారులు ఈ జాబితాలో ఉన్నారు.

జీవన్ రక్ష పతకాలు- 2021
ప్రజల ప్రాణాలు కాపాడే క్రమంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన పారామిలటరీ, భద్రతాదళాల్లోని సిబ్బందికి ఈ పతకాలను కేంద్రం ప్రకటిస్తుంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మొత్తం 51 మందిని ఎంపిక చేయగా, వారిలో సర్వోత్తమ్ జీవన్ రక్ష పతకాలకు ఆరుగురు, ఉత్తమ్ జీవన్ రక్ష పతకాలకు 16 మంది, జీవన్ రక్ష పతకాలకు 29 మంది ఉన్నారు. జీవన్ రక్ష పతకం సాధించినవారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జి. సంజయ్ కుమార్, టి. వెంకట సుబ్బయ్య, ఎన్. గణేశ్ కుమార్‌తో పాటు రైల్వే మంత్రిత్వశాఖలో పనిచేస్తున్న తెలుగు అధికారి బొంగు నరసింహా రావు ఉన్నారు.

ఫైర్ సర్వీసెస్ – ప్రెసిడెంట్ మెడల్
రిపబ్లిక్ డే పురస్కరించుకొని అగ్ని మాపక, హోంగార్డ్స్, సివిల్ డిఫెన్స్ విభాగాల్లో పనిచేసే సిబ్బందికి కేంద్ర హోంశాఖ ప్రెసిడెంట్ మెడల్స్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 42 మంది ఫైర్ సర్వీస్ అధికారులు ఈ మెడల్స్ కోసం ఎంపికయ్యారు. వారిలో తెలంగాణకు చెందిన కాళహస్తి వెంకట కృష్ణ కుమార్ (డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్)కు ప్రెసిడెంట్ ఫైర్ సర్వీస్ విశిష్ట సేవా మెడల్ వరించింది.

జైళ్ల శాఖ కరెక్షనల్ సర్వీస్ మెడల్స్
జైళ్ల శాఖకు కరెక్షనల్ సర్వీస్ మెడల్స్‌కు ఎంపికైనవారిలో తెలంగాణ రాష్ట్రం నుంచి ముగ్గురున్నారు. ప్రెసిడెంట్ కరెక్షనల్ సర్వీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ విభాగం కింద ఎం పంత్(చీఫ్ హెడ్ వార్డర్), సిఎన్ గంట రత్నారావు(హెడ్ వార్డర్), బి. నర్సింగ్ రావు(హెడ్ వార్డర్) ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆరుగురు ఎంపికవగా, వారిలో ఒకరికి ప్రెసిడెంట్ కరెక్షనల్ సర్వీస్ విశిష్ట సేవా పతకం, ఐదుగురికి మెరిటోరియస్ సర్వీస్ పతకాలు దక్కాయి. ఐనపర్తి సత్యనారాయణ (హెడ్ వార్డర్)కు విశిష్ట సేవా పతకం లభించగా, పోచ వరుణ రెడ్డి (డిప్యూటీ సూపరింటెండెంట్), పెదపూడి రామ చంద్ర రావు (డిప్యూటీ సూపరింటెండెంట్), మహ్మద్ షఫీ రహమాన్ (డిప్యూటీ సూపరింటెండెంట్), సాము చంద్ర మోహన్ (హెడ్ వార్డర్), హంసా పాల్ (డిప్యూటీ సూపరింటెండెంట్)లకు మెరిటోరియల్ సర్వీస్ పతకాలు లభించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement