గణతంత్ర వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉత్తరాఖండ్ టోపీ, మణిపూర్ కండువాలో కనిపించడంతో .. దీనిపై చర్చ మొదలైంది. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతి స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకలకు తలకు తలపాగా ధరించి సంప్రదాయ వస్త్రధారణలో ప్రధాని నరేంద్ర మోడీ రావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈసారి జరిగిన గణతంత్ర వేడుకల్లో మోడీ దానికి స్వస్తి పలికారు. బ్రహ్మకమలం చిత్రంతో ఉన్న ఉత్తరాఖండ్ సంప్రదాయ టోపీని తలపై ధరించారు. అలాగే ఆయన తన మెడపై వేసుకున్న కండువా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మణిపూర్ సంప్రదాయానికి సంబంధించిన కండువాను మోడీ ధరించడం విశేషం. ప్రధాని మోడీ ఈ వస్త్రధారణ కొత్త చర్చకు తెరలేపింది. ఎందుకంటే ఇప్పటివరకు గణతంత్ర, స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని మోడీ కనిపించిన దానికి భిన్నంగా ఈ సారి ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా.. తలపాగా, మెడపై కండువా వేసుకోవడమే. దీనికి ప్రధాన కారణం ఎన్నికల స్టంటే అని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.
ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓట్ల కోసం ఆయన నేడు ఆయా రాష్ట్రాల సంప్రదాయ వస్త్రాలను ధరించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదిలావుండగా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, రాష్ట్ర వారసత్వ సంపదను ప్రపంచం ముందు ప్రతిబింభించేందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. నేడు 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీజీ దేవభూమి ఉత్తరాఖండ్ టోపీని ధరించి, బ్రహ్మ కమలంతో అలంకరించబడి, మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాన్ని గర్వించేలా చేసారు. ఉత్తరాఖండ్‌లోని 1.25 కోట్ల మంది ప్రజల తరపున, ప్రధానమంత్రికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. మణిపూర్ మంత్రి బిశ్వజిత్ సింగ్ సైతం ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..