Friday, November 22, 2024

టీచర్ల ప్రమోషన్లకు తొలగిన అడ్డంకి.. పండిట్‌, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్‌పై కేసు వాప‌స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీచర్ల ప్రమోషన్లకు ఎప్పటి నుంచో ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం చొరవతీసుకుని ఉపాధ్యాయ సంఘాల నేతలను శాంతపరుస్తోంది. ఈక్రమంలోనే ప్రమోషన్లు, బదిలీలకు మార్గం సుగమం అయింది. పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్‌కు సంబంధించి పదోన్నతుల విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా కోర్టుకేసుల కారణంగా ఎస్‌ఏ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పదోన్నతులు కల్పించలేకపోతున్నారు. ఈ విషయంలో కోర్టుకువెళ్లిన బీపీఈడీ అర్హత కలిగిన ఎస్జీటీలు, ఇతర సంఘాల నేతలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కార్యాలయంలో సమావేశమై చర్చించింది. ఈమేరకు కేసును ఉపసంహరించుకోవాలని వారిని సూచించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే బీపీఈడీ అర్హత కలిగిన ఎస్జీటీలకు, పీఈటీఏ టీఎస్‌ మధ్య పీఆర్టీయుటీఎస్‌ సంఘం ఆధ్వర్యంలో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో నెం.110ని ఉపసంహరించుకుంటూ, సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌ నెం.2, జీవో నెం.11, 12 ప్రకారం ఉమ్మడి సీనియారిటీతో బీపీఈడీ అర్హత కలిగిన ఎస్జీటీలకు, పీఈటీలకు ఎస్‌ఏ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పదోన్నతులలో అవకాశం కల్పించాలని ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం ప్రమోషన్లను కల్పిస్తే కోర్టుకు వెళ్లిన ఎస్జీటీలు కేసులను తాము ఉపసంహరించుకుంటామని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఒప్పందానికి అనుగుణంగా వీలైనంత త్వరగా ఎస్‌ఏ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పదోన్నతులు కల్పించాలని సంఘాల నేతలు మంత్రిని కోరారు. దాంతో ప్రభుత్వానికి తలనొప్పిగా ఉన్న ఈ సమస్య ఇక దాదాపు సద్దుమనిగినట్లే.

కోర్టుకు వెళ్లడంతో…
గతంలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 15, 17, 18ల ప్రకారం అప్‌గ్రేడ్‌ అయిన 1849 ఎస్‌ఏ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (పీడీ) పోస్టుల అంశంలో బీపీఈడీ అర్హత కలిగిన ఎస్జీటీలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. దీనికి అనుబంధంగా గతేడాది అక్టోబర్‌ 5న మరోసారి ప్రభుత్వం జీవో నెం.110ని జారీ చేసింది. దీనిపై కూడా ఎస్జీటీ వాళ్లు స్టే తీసుకొచ్చారు. దాంతో అప్పట్లో అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియకు బ్రేక్‌పడింది. ప్రస్తుతం ఈ అడ్డంకి తొలగడంతో ప్రమోషన్లకు మార్గం సుగమం అయ్యింది. కేసు ఉపసంహరణపై మంత్రి స్పందిస్తూ ఇది శుభపరిణామమన్నారు. మంత్రిని కలిసిన వారిలో పీఆర్టీయుటీఎస్‌ నేతలు శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, పీఈటీఏ టీఎస్‌ నేతలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement