ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం లౌడ్ స్పీకర్లు, మైకులపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాలు, మసీదుల్లో మైక్‌ల తొలగింపుపై స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈ నేపథ్యంలో వందలాది మతపరమైన ప్రాంతాల నుంచి లౌడ్స్పీకర్లను తొలగించినట్లు యూపీ పోలీసులు తెలిపారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మత పెద్దలతో సమావేశాలు నిర్వహించడంతోపాటు కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, వచ్చే నెలలో ఈద్, అక్షయ తృతీయ వేడుకలు ఒకే రోజున రానున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జహంగీర్‌పూర్‌లో హనుమాన్ ర్యాలీ సందర్భంగా జరిగిన ఘర్షణలు వంటివి తలెత్తకుండా సీఎం యోగి ముందస్తు చర్యలు చేపట్టారు. యూపీలో శాంతి భద్రతలపై సమీక్షించారు. ఎలాంటి ఘర్షణలు జరుగకుండా తగిన చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.
ఇందులో భాగంగా మతపరమైన ప్రదేశాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన మైక్‌లను తొలగించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దన్నారు. అలాగే కోర్టు ఆదేశాలతో ఏర్పాటు చేసిన మైక్‌ల శబ్ధాన్ని నియంత్రించాలని ఆదేశించారు. దీంతో యూపీ పోలీసులు కార్యాచరణలోకి దిగారు. మతపరమైన ప్రాంతాల నుంచి లౌడ్‌స్పీకర్ల తొలగింపునకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అలాగే వివాహాలు, మతపరమైన వేడుకల్లో అనుమతించే శబ్ధ స్థాయిలపై కరపత్రాల ద్వారా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. సంబంధిత ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తమ పిలుపుతో గుడులు, మసీదుల్లోని మైక్‌లను కొందరు స్వచ్ఛందంగా తొలగించారని, మరికొందరు సౌండ్స్‌ని తగ్గించారని యూపీ పోలీసులు పేర్కొన్నారు.