Monday, November 18, 2024

Story : రిమోట్ వోటింగ్ మిషన్.. ఉన్న‌చోటు నుండే ఓటు వేయొచ్చు

ఓటు హక్కు వినియోగించుకోవ‌డానికి విదేశాల్లో ఉన్న‌వారు సైతం త‌మ సొంత వూర్ల‌కి వెళ్లాల్సిన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అయితే ఇక‌పై ఓటు వేయ‌డానికి సొంత ఊర్ల‌కి వెళ్ల‌న‌వ‌స‌రం లేద‌ట‌. ఉద్యోగాలకు లీవులు పెట్టి.. ప్రయాణ ఖర్చులు భరించి సొంత ఊర్లకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్న వారు ఎంతోమంది. దీని వల్ల మూడో వంతు ఓటర్లు పోలింగ్ కు దూరంగా ఉండాల్సి వస్తుంది. స్వస్థలాలను వదిలి బతుకు తెరువు కోసం వేరే ఊర్లలో ఉద్యోగాలు చేసేవారికి ఓటుహక్కును వినియోగించుకోవడం గగనంగా మారడంతో దేశంలో మూడోవంతు ఓటర్లు పోలింగ్ కు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఇది ఆందోళన కలిగించే విషయమే.

ఈ సమస్యను పరిష్కరించే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేసింది. దీంట్లో భాగంగా కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుడుతోంది. సొంతూర్లను వదిలి వివిధ కారణాల వల్ల వలసలు వెళ్ళిన వారు తాము ఉన్నచోటు నుంచే.. తమ తమ నియోజకవర్గాల్లో ఓటువేసేలా ‘రిమోట్ వోటింగ్ మిషన్’ ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల సంఘం ఈ రిమోట్ ఓటింగ్ కు సంబంధించి కాన్సెప్ట్ నోట్ ను సిద్ధం చేసింది. రిమోట్ ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ (ఆర్ విఎం) నమూనాను కూడా దీంతోపాటు రూపొందించింది. ఈ రిమోట్ ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ ద్వారా ఒక్క పోలింగ్ బూత్ నుంచే 72 నియోజకవర్గాల్లోని వారు తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఈ మేరకు ఈ ఆర్ విఎంను డెవలప్ చేశారు. ఈ నమూనా మిషన్ ప్రదర్శన కోసం జనవరి 16న దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఎన్నికల కమిషన్ ఆహ్వానించింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. రిమోట్ ఓటింగ్ ని అమలులోకి తెచ్చే కంటే ముందు.. దాని అమలులో ఎదురయ్యే న్యాయపరమైన, సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఎన్నికల కమిషన్ వివరించింది. దీనికోసమే రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకోనున్నట్లు తెలిసింది.

ఈసీ ఈ రిమోట్ వోటింగ్ ప్రయత్నం వెనుక ఉన్న కారణాలు తెలుపుతూ.. ‘2019 సార్వత్రిక ఎన్నికలలో నమోదైన పోలింగ్ శాతం 67.4. ఈ ఎన్నికల్లో దాదాపు దేశంలోని 30 కోట్ల మందికిపైగా ఓటర్లు.. వివిధ కారణాల వల్ల తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఈ పరిస్థితి ఆందోళనకరమైనది. ఓటర్లు తాము ఇప్పుడు ఉంటున్న కొత్త ప్రదేశాల్లో ఓటు నమోదు చేసుకోకపోవడానికి కారణాలు అనేకం. దీంతో అర్హులైన చాలా మంది ఓటు వేయలేకపోయారు. ఇందులో ప్రధాన కారణం అంతర్గత వలసలు. అంటే దేశంలోనే ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం. చదువు, ఉద్యోగాలు,పెళ్లిళ్లు వంటి కారణాలతో ఓటర్లు సొంత ప్రాంతాలను వదిలి దూరంగా వెళుతున్నారు.

- Advertisement -

దేశంలో దాదాపుగా ఇలాంటి వారు 85 శాతం మంది ఉన్నారు’ అని ఈసీ తెలిపింది. అలా తమ ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు వలస వెళ్లినవారు కూడా ఇలాంటి ప్రయాస లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ రిమోట్ ఓటింగ్ పై దృష్టి పెట్టామని ఈసీ తెలియజేసింది. దీని మీద ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పండుగలో దేశంలోని మరింత మంది పాల్గొనడానికి ఈ రిమోట్ వోటింగ్ విధానం దారి చూపుతుందని అన్నారు. ఈ ప‌ద్ద‌తితో ఓటు వేయ‌లేక‌పోతున్నామ‌నే బాధ ఇక‌పై ఉండ‌దు.

Advertisement

తాజా వార్తలు

Advertisement