Saturday, November 23, 2024

Spl Story: రిల‌య‌న్స్ జాబ్ అంటే హ‌మాలీ ప‌నేనా?.. అసంతృప్తితో మానేస్తున్న యువ‌తీ, యువ‌కులు!

విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్​ సిటీలో విపరీత పోకడలు కనిపిస్తున్నాయి. ఉపాధి కోసం ఊళ్లొదిలి వచ్చే వారిని టార్గెట్​గా చేసుకుని కొన్ని కంపెనీలు మోసాలకు తెగబడుతున్నాయి. కొంతమంది వ్యక్తులు యువత ఆశలు, ఆశయాలను ఆసరాగా చేసుకుని వారి రక్త మాంసాలు ఉడిగే దాకా గొడ్డు చాకిరీ చేయించుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అందులో భాగంగా రిలయన్స్​ స్మార్ట్​ స్టోర్ట్స్​, రిలయన్స్​ ఫ్రెష్​ వంటి పెద్ద పెద్ద మాల్స్​లో వెట్టిచాకిరీ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై వార్తా కథనాలు రావడంతో ఆ కంపెనీ యాజమాన్యం దృష్టిసారించి సంబంధిత ఉద్యోగులకు వార్నింగ్​ మాత్రమే ఇచ్చి సరిపుచ్చుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా లెటర్స్​పై సంతకాలు చేయించుకున్నట్టు తెలుస్తోంది.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

ఉన్నత చ‌దువులు చ‌దివి.. ఉన్న ఊళ్లో ఉపాధి లేక ప‌ట్నం బాట ప‌ట్టేవాళ్లు చాలామంది ఉంటారు. సొంతూరి నుంచి క‌ట్టుబ‌ట్టల‌తో సిటీకి వస్తుంటారు. ఉపాధి దొరుకుతుంది, కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవచ్చన్న కోటి ఆశ‌ల‌తో ప‌ట్నం వ‌స్తే వారి ఆశ‌లు, ఆశ‌యాల‌ను ఆస‌రాగా చేసుకుని రిల‌య‌న్స్ వంటి బ‌డా మాల్స్ మోసాలకు తెగ‌బ‌డుతున్నాయి. హైద‌రాబాద్ సిటీకి వ‌చ్చిన చాలామంది యువ‌తీ, యువ‌కులను నిలువునా ముంచుతున్నాయి.

లేబ‌ర్ యాక్ట్ ప్రకారం ఏ కంపెనీ అయినా 8 గంట‌ల‌కు మించి వ‌ర్క్ చేయించ‌కూడ‌దు. కానీ, రిలయన్స్​ స్టోర్స్ కెపాసిటీకి తగ్గట్టు స్టాఫ్‌ని పెట్టుకోకుండా అక్కడుండే మేనేజ‌ర్లు, పైనున్న వారి మెప్పు పొంద‌డానికి త‌క్కువ మంది స్టాఫ్‌తో ప‌ని నెట్టుకొస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో 8 గంట‌ల ప‌ని కాస్తా దాదాపు 12 గంట‌ల దాకా చేయిస్తూ.. చాలామందిని శారీర‌క హింస‌కు గురిచేస్తున్నట్టు సమాచారం.

చాలా మంది యువ‌తీ, యువ‌కులు రిల‌య‌న్స్ లోజాబ్ అంటే ఎంతో గొప్ప అని క‌ల‌లు క‌ని వ‌చ్చామ‌ని, కానీ ఇక్కడికి వ‌చ్చిన త‌ర్వాత హ‌మాలీ ప‌నికంటే హీనంగా ఉంద‌ని ఆస‌హ‌నం వ్యక్తం చేస్తూ జాబ్ వ‌దిలేసి పోతున్నట్టు స‌మాచారం.

- Advertisement -

నోట్​ : పూర్తి స్టోరీ కోసం www.prabhanews.com లో చూడండి

అంతేకాకుండా స్టోర్ మేనేజ‌ర్లు, ఏఎస్ ఎంలు, డీఎంలు అంటూ రిల‌య‌న్స్ లో పై స్థాయిలో ప‌ని వెల‌గ‌బెడుతున్న వ్యక్తులు కింది స్థాయిలో ఉండేవారిని శారీర‌క, మాన‌సిక హింస‌ల‌కు గురిచేస్తున్నట్టు ఆరోప‌ణ‌లున్నాయి. ఎక్కువ ప‌నిగంట‌లు వ‌ర్క్ చేయించుకోవ‌డ‌మే కాకుండా కంప‌ల్సీరీ ప‌నిచేయాల్సిందేన‌ని ఒత్తిళ్లకు గురిచేస్తున్నట్టు చాలామంది క‌న్నీరు పెడుతూ చెబుతున్నారు

అయితే.. హైద‌రాబాద్ బండ్లగూడ‌లోని రిల‌య‌న్స్ లో జ‌రుగుతున్న ఆగ‌డాల‌పై శనివారం ఆంధ్రప్రభలో వ‌చ్చిన క‌థ‌నంతో ఆ సంస్థ యాజ‌మాన్యం దిగివచ్చింది. ఆదివారం ఆగ‌మేఘాల‌పై హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ క‌దిలి వ‌చ్చింది. ఆ స్టోర్‌లో ఉన్న సిబ్బందిని ప‌లు ప్రశ్నలు అడిగిన‌ట్టు స‌మాచారం. దీనికి చాలామంది ఎక్కువ ప‌నిగంట‌లు వ‌ర్క్ చేయించుకుంటున్నార‌ని క‌రాఖండిగా చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ఒక్కొక్కరుగా పిలిచి వారి ద్వారా లెటర్లు రాయించుకుని ఎవరికీ ఫిర్యాదు చేయొద్దని, ఎవరు అడిగినా తప్పు జరగడం లేదని చెప్పాలని సంతకాలు చేయించుకున్నట్టు సమాచారం. కాగా, కొత్తగా వ‌చ్చిన ఏ ఎస్ ఎం నోటి దురుసుతో కొంత‌మంది మ‌హిళా సిబ్బంది ఇబ్బందుల‌కు గురై జాబ్ మానేసిన‌ట్టు స‌మాచారం.

ఇట్లాంటి ఆగ‌డాలే రిల‌య‌న్స్ లోని మిగ‌తా స్టోర్స్ లో జ‌రుగుతున్నాయ‌ని, అయితే ఈ విషయాలు ఎవ‌రికి చెప్పుకోవాలే తెలియ‌క త‌మ‌లో తామే కుమిలిపోతున్నామ‌ని చాలామంది ఆవేద‌న వ్య క్తం చేస్తున్నారు. స్టోర్‌లో జ‌రిగి విష‌యాలు బ‌య‌టికి తెలిస్తే త‌మ జాబ్ తీసేస్తార‌న్న ఆవేద‌న కూడా వారిలో క‌నిపిస్తోంది. ఓ గుడ్ రెప్యూటేష‌న్ ఉన్న రిల‌య‌న్స్ సంస్థ లో కొంతమంది విపరీత పోకడలతో ఇట్లాంటి దారుణాలు జ‌ర‌గ‌డంపై పూర్తి స్థాయిలో  పోలీసులు ద‌ర్యాప్తు చేయాల‌ని, షీటీమ్స్ ద్వారా వారికి ర‌క్షణ క‌ల్పించాల‌ని బాధిత ఉద్యోగులు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి : బండ్ల‌గూడ రిల‌య‌న్స్‌లో ఆగ‌డాలు.. మ‌హిళా సిబ్బందికి నిత్యం వేధింపులు, షీటీమ్స్‌కి అందిన‌ ఫిర్యాదులు

Advertisement

తాజా వార్తలు

Advertisement