రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంచలన ప్రకటన చేశారు. తన వారసులకు రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యాన్ని అప్పగించబోతున్నట్టు ప్రకటించారు. తన తండ్రి ధీరూభాయి అంబానీ వర్ధంతిని కుటుంబ వేడుక (ఫ్యామిలీడే)గా ఏటా ముకేశ్ జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని తెలిపారు.
తన వారసులు.. ఆకాశ్, ఈషా, అనంత్ సామర్థ్యాలపై నాకు ఎటువంటి సందేహం లేదన్నారు. తన తండ్రి ధీరూభాయి అంబానీ మాదిరే వారిలోనూ మంచి చురుకుదనం, సామర్థ్యాలు ఉన్నాయని చెప్పారు. రిలయన్స్ ను మరిన్ని ఉన్నత శిఖరాలకు వారు తీసుకెళతారని విశ్వాసం వ్యక్తం చేశారు. రిలయన్స్ లో ప్రతిభా పాటవాలు కలిగిన యువ నాయకత్వానికి కొదవ లేదన్న అంబానీ.. నాయకత్వ మార్పుపై కసరత్తు జరుగుతోందన్నారు. ఇతర సీనియర్లతో కలసి దీన్ని వేగవంతం చేస్తామని ముకేశ్ అంబానీ వెల్లడించారు.
లిస్టెడ్ కంపెనీలలో చైర్‌పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ పదవులను విభజించడానికి SEBI యొక్క ఏప్రిల్ 2022 గడువు కంటే ముందే ముకేశ్ అంబానీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనసాగుతోంది. దీనికింద రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్, ఆయిల్, గ్యాస్, పెట్రోకెమికల్, క్లీన్, రెన్యువబుల్ ఎనర్జీ వ్యాపారాలు ఉన్నాయి. 64 ఏళ్ల ముకేశ్ అంబానీ.. తన తండ్రి ధీరూభాయి అంబానీ మరణం తర్వాత 2002లో రిలయన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ముకేశ్ వారసులైన ముగ్గురు పిల్లలు.., ఆకాష్, ఇషా, అనంత్ లు రిలయన్స్ సంస్థలోని టెలికాం, రిటైల్, ఇంధన వ్యాపారాలను చూస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..