Friday, November 22, 2024

Good News: కాంట్రాక్ట్‌ లెక్చరర్ల పెండింగ్‌ వేతనాలు రిలీజ్‌.. 61.77కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు

తెలంగాణలో కాంట్రాక్ట్‌ లెక్చరర్ల నిరీక్షణ ఫలించింది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేసే కాంట్రాక్ట్‌, ఇతర అధ్యాపకుల గత ఏడాది పెండింగ్‌ వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఇవ్వాల (సోమవారం) ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: 2021 విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారు 16 జిల్లాలకు చెందిన కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు ఫిబ్రవరి, మార్చి నెలల వేతనాలు అందలేదు. కొన్ని జిల్లాలకు ఏప్రిల్‌, మే నెలకు సంబంధించిన పెండింగ్‌ వేతనాలనూ చెల్లించలేదు. అధ్యాపకుల వేతనాలు విడుదల కాకపోవడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న కాంట్రాక్ట్‌ లెక్చరర్లు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ జీవో నెంబర్‌ 30 జారీ చేస్తూ రూ.61 కోట్ల 77 లక్షలు మంజూరు చేసింది. దీంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అధ్యాపకులకు ఊరట లభించినట్లయింది.

ప్రభుత్వం విడుదల చేసిన ఈ బడ్జెట్‌తో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ లెక్చరర్లు, ఇతరులకు పెండింగ్‌ వేతనాలతో పాటు ఈ ఏడాది జనవరి నుంచి వేతనాలను చెల్లించే వీలుంది. వారి పెండింగ్‌ వేతనాలకు సంబంధించిన బడ్జెట్‌ను ప్రభుత్వం మంజూరు చేయడంపట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆర్థికశాఖ మంత్రి హరీష్‌ రావులకు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.రమణారెడ్డి, డాక్టర్‌ కొప్పిశెట్టి సురేష్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉత్తర్వులకు సంబంధించి వేతనాల ప్రొసీడింగ్స్‌ను వెంటనే ఇవ్వాలని ఇంటర్‌ విద్యా కమిషనర్‌కు ఈమేరకు వారు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement