ఈ పెళ్లి కూతురు నిర్ణయాన్ని అంతా స్వాగతిస్తున్నారు. కోటి ఆశలతో అత్తారింటికి వెళ్లే ఆ నవ వధువు తీసుకున్న నిర్ణయం ఎంతో మందికి ఆదర్శంగా మారనుంది. ఎందుకంటే తన భవిష్యత్ కలలను నెరవేర్చుకునే భాగస్వామి తనకు ఆ సమయంలో అంతగా నచ్చలేదు. దీంతో మూడుముళ్లు వేసుకోవాల్సిన టైమ్లో ఆ యువతి ఏం చేసిందో తెలుసా? ఈ విషయం తెలుసుకోవాలంటే ఈ ముచ్చట మొత్తం చదివి తెలుసుకోవాల్సిందే..
అది ఓ పెళ్లి మండపం.. ఇరు కుటుంబాల నుంచి పెద్ద ఎత్తున బంధుగణం తరలివచ్చారు. అంతా సంతోషంగా పెళ్లి తంతును చూస్తున్నారు. వేదిక మీద అయ్యగారు, పెళ్లి కూతురుతో పాటు వారి తల్లిదండ్రులు ఇతర పెద్దలంతా కూర్చున్నారు. ఇంకా పెళ్లికొడుకు ఆ వేదిక మీదికి రాలేదు.. పెళ్లి కొడుకు తండ్రి ‘‘ఏరా అబ్బాయ్, ఇంకా రావాలని లేదా, నీ దోస్తులతో ఇంతసేపు బయటే ఏం చేస్తున్నవ్”అని కేకేశాడు..
దీంతో తన దోస్తులతో అప్పటిదాకా సరదాగా గడిపిన ఆ పెళ్లికొడుకు, అతని దోస్తులంతా మండపం దగ్గరికి వచ్చారు. పెళ్లి పీటలమీద కూర్చున్న పెళ్లికొడుకు నుంచి మద్యం వాసన వచ్చింది. దీంతో పెళ్లి కూతురు అసహ్యించుకుంది. ఇరు కుటుంబాలు సంతోషంగా ఉండగా.. ఇంత సంబురంగా జరుగుతున్న పెళ్లి రోజే మద్యం మానని ఈ వ్యక్తి ఆ తర్వాత ఎలా మానుతాడు అని ఆలోచించింది. ఇతన్ని చేసుకుంటే తన జీవితం ఇక అంతే అని భావించింది..
ఇక.. మూడుముళ్లు వేయాల్సిన టైమ్లో ఈ పెళ్లికొడుకును తాను చేసుకోను అని తెగేసి చెప్పింది. దాంతో అక్కడున్నవాళ్లంతా అవాక్కయ్యారు. ఒక్కసారిగా పెళ్లి బాజాలు ఆగిపోయాయి. అయ్యగారి మంత్రాలు ఆగిపోయాయి. ఒక విధమైన ఉద్విగ్న క్షణాలు నెలకొన్నాయి. ఆ అమ్మాయిని ఒప్పించడానికి ఇరు వర్గాలు ఎంతో ట్రై చేశాయి. అయినా తన మాటమీద నిలబడింది ఆ యవతి.. తను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోనని, ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే తాగి వచ్చిన వ్యక్తి ఇక ఫ్యూచర్లో ఎలా మందు మానేస్తాడని చెప్పుకొచ్చింది.
ఇది విన్న వధువు తరపు వారు, ఆమె తల్లిదండ్రులు కూడా కన్విన్స్ అయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో జరిగింది. ఉపాధ్యాయుడు అయిన వినోద్ శుక్లా కుమార్తె నేహా వివాహం నెహ్రూ నగర్లో ఉంటున్న రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ నాగేంద్రమణి మిశ్రా కుమారుడు పీయూష్ మిశ్రాతో జరగాల్సి ఉంది. పెళ్లి ఊరేగింపునకు వధువు కుటుంబీకులు స్వాగతం పలికిన తర్వాత వారు దండల మార్చుకునే వేడుకకు జరగాల్సి ఉంది.. ఆ టైమ్లో వరుడు మద్యం మత్తులో ఉన్నాడని గ్రహించిన వధువు ఈ పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది.
కాగా, అందరూ నేహాని ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ పెళ్లి రోజు మద్యాన్ని వదులుకోలేని వ్యక్తి పెళ్లి తర్వాత ఏం చేస్తాడని చెప్పింది. ఆమె నిర్ణయానికి కుటుంబ పెద్దలు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఆ తర్వాత విషయం కాస్తా పోలీసు స్టేషన్కు చేరుకుంది.అక్కడ పరస్పర అంగీకారంతో మార్పిడి చేసుకున్న నగదు, విలువైన వస్తువులను తిరిగి ఇచ్చేందుకు ఇరువర్గాలు అంగీకరించాయి. నేహా తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలామంది స్వాగతిస్తూ గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు.