Saturday, November 23, 2024

ఉపాధ్యాయ​ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు శ్రీకారం.. మార్చిలో ముగియనున్న పదవీకాలం

(ప్రభన్యూస్‌బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి) : హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. నవంబర్‌ 7వ తేదీవరకు పేర్ల నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఎక్కువమంది పేర్లు నమోదు చేయించేందుకు అప్పుడే ఆయా ఉపాధ్యాయ సంఘాలు నడుం బిగించాయి. ఎన్నికలకు ఇంకా ఆరుమాసాల గడువు ఉంది. అప్పుడే చాపకిందనీళ్లలా ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు…రెండవసారి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కాటెపల్లి జనార్థన్‌రెడ్డి మూడవసారి బరిలో దిగేందుకు ప్రయత్నిస్తుండగా తన సొంత సంఘంలో కీలక నేతగా కొనసాగుతున్న చెన్నకేశవరెడ్డి నుండి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. టీఎస్‌యూటీఎఫ్‌ సంఘం మాత్రం ఐదుమాసాల ముందే అభ్యర్థిని ప్రకటించింది…మరోసారి ఆ సంఘం కీలక నేత పాపన్నగారి మాణిక్‌రెడ్డి బరిలో దిగబోతున్నారు. శుక్రవారం ఆయన పేరును ప్రకటించారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే ఏడాది మార్చిలో జరగనున్నాయి. ఓటర్ల నమోదుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో ముందుగానే అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే టీఎస్‌యూటీఎఫ్‌ కీలక నేత పాపన్నగారి మాణిక్‌రెడ్డిని బరిలో దింపనుంది. ఆ మేరకు శుక్రవారం కీలక సమావేశంలో మాణిక్‌రెడ్డిని మరోసారి బరిలో దింపాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓటర్ల నమోదు కార్యక్రమంలో విరివిగా పాల్గొనాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్థన్‌రెడ్డి మూడవసారి బరిలో దిగేందుకు తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్సీగా విజయం సాధించారు.

మూడవసారి కూడా బరిలో దిగాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. కాకపోతే పీఆర్‌టీయూ సంఘంలో కీలక నేతగా కొనసాగుతున్న చెన్నకేశవరెడ్డి నుండి పోటీ నెలకొంది. ఈసారి తనకు అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు. సిట్టింగ్‌లకు అవకాశం కల్పిస్తే మాత్రం కాటెపల్లి మరోసారి బరిలో దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మార్పు చేయాలనుకుంటే మాత్రం చెన్నకేశవరెడ్డి పేరు పరిశీలించే అవకాశం ఉంది. ఓటర్ల నమోదు కార్యక్రమం నవంబర్‌ 7వ తేదీవరకు కొనసాగనుంది. హైస్కూల్‌ ఆ పై స్థాయి విద్యా సంస్థల్లో పని చేసే వారు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవచ్చు. గడిచిన ఆరేళ్లలో మూడేళ్ల సర్వీస్‌ తప్పనిసరి ఉన్న వారే ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవచ్చు.

- Advertisement -

గతంలో జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్‌,రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో 23వేలకు పైగానే ఓటర్లు ఉన్నారు. గతఎన్నికలో కాటెపల్లి జనార్థన్‌రెడ్డి 4వేల మెజార్టీతో విజయం సాధించారు. అప్పట్లో ఏకంగా 12మంది బరిలో నిలిచారు. పోటీమాత్రం కాటెపల్లి జనార్థన్‌రెడ్డి.. పాపన్నగారి మాణిక్‌రెడ్డి మధ్యే కొనసాగింది. జనార్థన్‌రెడ్డి అధికార పార్టీ సహకారంతో బరిలో దిగగా మాణిక్‌రెడ్డి మాత్రం సీపీఎం సహకారంతో పోటీ చేశారు. అప్పట్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పని చేసిన వారే పోటీపడ్డారు. మెజార్టీ ఓటర్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నారు. దీంతో ఇక్కడ పని చేసిన వారికే ప్రాధాన్యం కల్పించనున్నారు. మిగతా జిల్లాలకు చెందిన వాళ్లు కూడా బరిలో దిగనున్నారు. మొత్తం మీద గతసారితో పోలిస్తే ఈసారి పోటీ చేసే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

పదోన్నతుల పంచాయతీ..
ఉపాధ్యాయులకు దాదాపుగా ఏడేళ్లుగా పదోన్నతులు లేవు. దీంతో వీరంతా గుర్రుగా ఉన్నారు.వీరందరినీ మచ్చిక చేసుకోవాలంటే తప్పనిసరిగా పదోన్నతులు కల్పించాల్సి ఉంది. దాంతోపాటు బదిలీ ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టాల్సి ఉంది. పదోన్నతులు కల్పించి బదిలీలు చేస్తారనే ప్రచారం కొంతకాలంగా వినిపిస్తోంది. కానీ కార్యరూపం దాల్చడం లేదు. స్కూళ్లకు పారిశుద్ధ్య కార్మికులు లేరు. చాలా ప్రాంతాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు చేసుకోవల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ పంచాయతీలకు. మునిసిపాలిటీలకు బాధ్యతలు అప్పగించినా సరియైన విధంగా అమలు కావడం లేదు. స్కూళ్లకు మేనేజ్‌మెంట్‌ గ్రాంట్లు విడుదల చేయడంలో జాప్యం జరుగుతోంది. ప్రధానోపాధ్యాయుల పేరుతో నిధులు మంజూరు చేస్తారు.

కానీ ఈసారి ఇంకా ఆ నిధులు వారి ఖాతాల్లో జమ కాలేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో నాన్‌లోకల్‌ పంచాయతీ కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలపై వస్తున్నారు. వాళ్లు కోరుకున్న ప్రాంతాల్లో పోస్టింగ్‌లు తెచ్చుకుంటున్నారు. వాస్తవానికి 20 శాతం మేర నాన్‌ లోకల్స్‌ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఇప్పటికే 50 శాతం మేర నాన్‌ లోకల్స్‌ కొనసాగుతున్నారు. దీనిని అన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నా పై స్థాయిలో పలుకుబడిని ఉపయోగించి నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్‌లు తెచ్చుకుంటున్నారు. మొత్తం మీద ఉపాధ్యాయులు, లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా అధికార పక్షం నడుం బిగించింది. ఇందులో ఎంతమేర సమస్యలు పరిష్కరిస్తారనేది వేచి చూడాలి..

Advertisement

తాజా వార్తలు

Advertisement