Friday, November 22, 2024

డైమండ్ ఆకారంలోకి రీజినల్ రింగ్ రోడ్డు!

హైదరాబాద్‌ చుట్టూ మరో రింగ్ రోడ్డు రానుంది. చౌటుప్పల్, సంగారెడ్డి తదితర ప్రాంతాలను కలుపుతూ ప్రతిపాదించిన రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.  హైదరాబాద్ చుట్టూ నిర్మించే రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ ఆర్ ఆర్)పై టీఆర్ఎస్ లీడర్లు, రియల్టర్లు కన్నేశారు. ఏయే ప్రాంతాల మీదుగా  రోడ్డు వెళ్తుందో ఆరా తీస్తున్నారు. రోడ్డు అలైన్​మెంట్ వివరాల కోసం పైరవీలు చేస్తున్నారు. తమకు అనుకూలంగా అలైన్​మెంట్​ను మార్చుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కీలక మంత్రుల చుట్టూ చక్కర్లు కొడ్తున్నారు. ప్రగతిభవన్​కు దగ్గరగా ఉండే లీడర్లను మచ్చిక చేసుకుంటున్నారని సమాచారం. తమ భూములు ఆర్​ఆర్​ఆర్​లో పోకుండా జాగ్రత్తలు పడే పనిలో కొందరు ఉంటే, తమ భూముల సమీపంగా రోడ్డు వెళ్లేలా చూడాలని మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొందరు రూట్ మ్యాప్ వివరాలు చెప్పాలని, దానికి తగ్గట్టు భూములు కొనుక్కుంటామని అంటున్నారు. 

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్​ఆర్ఆర్​కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో రోడ్డు అలైన్​మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ చేసి కేంద్రానికి పంపనుంది. ఈ విషయం గ్రహించిన టీఆర్ఎస్ లోని రియల్టర్లు, ఇతర రియల్ ఎస్టేట్ సంస్థల అధిపతులు రోడ్డు అలైన్​మెంట్​ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పైరవీలు చేస్తున్నారు. మెజార్టీ టీఆర్ఎస్ లీడర్లు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పార్టనర్లుగా ఉన్నారు. కొందరు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు బిజినెస్ ను తమ బంధువుల పేరుతో కొనసాగిస్తుండగా.. ఇంకొందరు రియల్ కంపెనీల్లో  స్లీపింగ్ పార్టనర్స్‌గా ఉన్నట్టు ప్రచారంలో ఉంది. వీళ్లు తమ రియల్ ఎస్టేట్ బిజినెస్ కు లాభం కలిగేలా రోడ్డు మ్యాప్​ చేయించేందుకు పైరవీలు చేస్తున్నారు. మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మున్సిపల్, హెచ్ఎండీఏ, ఆర్ అండ్ బీ ఆఫీసర్ల చుట్టూ కూడా తిరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

గతంలో ఫైనల్ చేసిన రింగ్ రోడ్డు వృత్తాకారంలో ఉండేదని, ప్రస్తుత ప్రపోజల్ చూస్తుంటే డైమండ్ ఆకారంలోకి  మారే చాన్స్ ఉందని అధికారులు అంటున్నారు. అలైన్​మెంట్​లో మార్పులు ఎక్కువగా ఉమ్మడి మెదక్, నల్గొండ జిల్లాల్లో జరగొచ్చని చెబుతున్నారు. గతంలో గజ్వేల్- నాచారం-శివంపేట-నర్సాపూర్ – సంగారెడ్డి మీదుగా రోడ్డు డిజైన్  చేయగా.. ప్రస్తుతం దాన్ని గజ్వేల్- తూప్రాన్-హత్నూర్- సంగారెడ్డికి కలిపేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. గజ్వేల్-జగదేవ్​పూర్- తుర్కపల్లి- భువనగిరి- వలిగొండ- చౌటుప్పల్ వరకు డిజైన్ చేయగా.. ప్రస్తుతం దాన్ని గజ్వేల్- ఆలేరు-మూటకొండూర్- సంగెం- చౌటుప్పల్ కు కలిపేలా మార్పులు చేస్తున్నట్టు సమాచారం. ఈ  ఏరియాల్లో టీఆర్ఎస్ లీడర్లు భారీగా భూములు కొన్నారని, వాళ్ల కోసం రింగ్‌ రోడ్డు  డిజైన్​లో మార్పులు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రెండేండ్ల కింద ఆర్​ఆర్​ఆర్ నిర్మాణంపై ప్రభుత్వం మ్యాప్ ను రెడీ చేసి కేంద్రానికి పంపినా దానిలో మార్పులు తప్పవని ఆఫీసర్లు అంటున్నారు. రింగ్ రోడ్డు ఏ ప్రాంతాల మీదుగా వెళ్లాలో నిర్ణయించేందుకు సీఎం త్వరలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

కాగా, రీజనల్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి మొత్తం 17వేల కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. ఇందులో 4 వేల కోట్లు భూసేకరణకే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 19 వందల ఐదు కోట్లను ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ త్వరగా జరిపితే.. రీజనల్ రింగ్‌ రోడ్‌ నిర్మాణం వేగంగా చేపడతామంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement