Tuesday, November 26, 2024

టీఎస్ఆర్టీసీలో గ‌రుడ ప్ల‌స్ బ‌స్సు చార్జీల త‌గ్గింపు..

గ‌రుడ ప్ల‌స్ బ‌స్సు చార్జీల‌ను త‌గ్గిస్తూ టీఎస్ ఆర్డీసీ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు త‌గ్గింపు చార్జీల విష‌యాన్ని మంత్రి పువ్వాడ తెలియ‌జేశారు. ప్రయాణీకులకు మంచి ప్రయాణం అందేంచేందుకు వీలుగా ఏసీ గరుడ ప్లస్ చార్జీలను రాజధాని టిక్కెట్టుకు సమానంగా స‌వ‌రించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. మంత్రి సూచ‌న మేర‌కు ఎండీ స‌జ్జ‌నార్ చార్జీల‌ను స‌వ‌రించిన‌ట్టు తెలిపారు. దీంతో ఎంచక్కగా రాజధాని ఫేర్ తో గరుడ ప్లస్ బస్సులో ప్రయాణించొచ్చుని సంస్థ స్పష్టం చేసింది. ఈ సవరించిన చార్జీల షెడ్యూల్ , ప్రత్యేక సర్వీసులకు మార్చి 31 వరకు వ‌ర్తించ‌నుంది.

కాగా, అంతరాష్ట్ర సర్వీసుల్లో అయితే తెలంగాణ సరిహద్దు దాటిన త‌ర్వాత‌ అంతకు మునుపు ఉన్న అంతరాష్ట్ర భాగంలో వర్తించే చార్జీలు వసూలు చేయనున్నట్లు ఎండీ స‌జ్జ‌నార్‌ తెలిపారు. కర్నాటక ఆర్టీసీతో సమానంగా ప్లెక్లీ ఛార్జీలు అమలులో ఉన్న హైదరాబాద్ – బెంగళూరు మార్గంలో నడిచే ఏసీ సర్వీసులకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేశారు. రవాణా రంగంలో ఉన్న పోటీని తట్టుకుని నిలబడడానికి ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సంస్థ ఎం.డి సజ్జనార్ అన్నారు.

హైదరాబాద్ – విజయవాడ మధ్య రూ .100, హైదరాబాద్- ఆదిలాబాద్ మధ్య రూ .111, హైదరాబాద్ – భద్రాచలం మధ్య రూ .121, హైదరాబాద్- వరంగల్ మధ్య రూ .54 లు తగ్గినట్లు ఆయన వివరించారు. ప్రజా రవాణా సేవల్ని వినియోగించుకుంటున్న ప్రయాణికులు ఆర్టీసీని మరింత ఆదరించి సంస్థ అభ్యున్నతికి దోహదపడాలని స‌జ్జ‌నార్‌ కోరారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement