Saturday, November 23, 2024

పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించండి, సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరించండి: ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ముఖ్యమంత్రులతో కొవిడ్‌ పరిస్థితుల నిర్వహణపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెట్రోల్‌ ధరల పెరుగుదలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలపై భారం తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో చమురుపై ఎక్సయిజ్‌ సుంకం తగ్గించినా, కొన్ని రాష్ట్రాలు మాత్రం వ్యాట్‌ను తగ్గించలేదని గుర్తుచేశారు. కేంద్రం పన్నులు తగ్గించినపుడు, ఈ విషయంపై రాష్ట్రాలకూ విజ్ఞప్తి చేశామని అయితే, కొన్ని రాష్ట్రాలు పట్టించుకోలేదన్నారు. దీనివల్ల అక్కడి ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. సమాఖ్యస్ఫూర్తిని ప్రస్తావిస్తూ. కోవిడ్‌పై పోరాటంలో అన్ని రాష్ట్రాలు సమాఖ్యస్ఫూర్తిని చాటాయని, యుద్ధం వంటి ప్రపంచ సమస్యల ప్రభావంతో ఎదురవుతున్న ఆర్థిక సమస్యలపైనా అదే పని చేయాలని అన్నారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. పౌరులపై భారం తగ్గించడానికి కేంద్రం గత నవంబర్‌లో పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సయిజ్‌సుంకాన్ని తగ్గించింది. పన్నులు తగ్గించి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని మేము రాష్ట్రాలను కోరాము. కొన్ని రాష్ట్రాలు తగ్గించాయి. కానీ మరికొన్ని రాష్ట్రాలు ఈ ప్రయోజనాన్ని ప్రజలకు బదిలీచేయలేదు. దీనివల్ల ఆయా రాష్ట్రాల్లో ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి. ఒకరకంగా ఈ రాష్ట్రాల ప్రజలకు ఇది అన్యాయమే. అంతేగాదు ఇది పొరుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతుంది అని మోడీ వివరించారు. తాను ఎవరినీ విమర్శించడం లేదని, కేవలం సూచన మాత్రమేనంటూ మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాల పేర్లను ఉటంకించారు. పన్నులు తగ్గించే రాష్ట్రాలు ఆదాయంలో నష్టాన్ని చవిచూడటం సహజమేనని, అయితే చాలా రాష్ట్రాలు ఆ సానుకూల చర్యను తీసుకున్నాయని తెలిపారు. పన్నులు తగ్గించకుంటే కర్ణాటకకు ఆరు నెలల్లో అదనంగా 5వేల కోట్లు ఆదాయం వచ్చేది. గుజరాత్‌కు కూడా 4వేల కోట్లు మిగిలేది అని చెప్పుకొచ్చారు. పన్నులు తగ్గించని కారణంగా ఏడు రాష్ట్రాలు రూ.12వేల కోట్ల రూపాయలు ఆర్జించాయని చెప్పారు. నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సయిజ్‌ సుంకాన్ని వరుసగా రూ. 5, రూ. 10 తగ్గించింది. దీన్ని అనుసరించి బీజేపీ, దాని మిత్రపక్షాల పాలిత రాష్ట్రాలు కొంతమేరు పన్ను తగ్గించాయి.

‘నాలుగో వేవ్‌’ భయాలపై సూచనలు..
సమావేశంలో భాగంగా రాష్ట్రాల్లో కొవిడ్‌ పరిస్థితులపై ప్రధాని సీఎంలతో చర్చించారు. గత రెండు వారాలుగా కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నందున మనమంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని, వైరస్‌ వ్యాప్తిని అరికట్టేలా మాస్క్‌ల వినియోగం, భౌతిక దూరం వంటి నిబంధనలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని తెలిపారు. టెస్ట్‌, ట్రాకింగ్‌, ట్రీట్మెంట్‌ విధానాన్ని సమర్థంగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించారు. కొత్త వేరియంట్లను ఎదుర్కొనేలా రాష్ట్రాలు అప్రమత్తం కావాలని ప్రధాని తెలిపారు. మెడికల్‌ కాలేజీలు, జిల్లా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బందిని పెంచాలన్నారు. ఆక్సిజన్‌ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.

అర్హులైన పిల్లలందరికీ వ్యాక్సినేషన్‌..
ఈ సందర్భంగా దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై మోడీ ప్రశంసలు కురిపించారు. దేశంలో 96 శాతం మంది వయోజనులకు కనీసం ఒక డోసు అందడం, ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని కొనియాడారు. అర్హులైన ప్రతి చిన్నారికి వ్యాక్సినేషన్‌ అందించడమే తమ ప్రథమ ప్రాధాన్యమన్నారు. మార్చి నుంచి 12-14 ఏళ్ల వారికి కూడా టీకాలు అందిస్తోన్న విషయాన్ని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement