ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తన ప్రభావంతో వాయవ్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఐదు జిల్లాలకు, బుధవారం నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం రోజు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక మిగతా జిల్లాల్లో ఈ రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
వరంగల్ జిల్లాలో వర్షాల నేపథ్యంలో అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. రెడ్, ఆరెంజ్ అలెర్ట్‌ను వాతావరణ శాఖ ప్రకటించింది. కలెక్టర్లు, పోలీసులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. వరంగల్, హన్మకొండ కలెక్టరేట్‌లలో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. వరంగల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 425 3424ని ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరపిలేకుండా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి ప్రధాన రోడ్లన్నీ జలమయం కాగా, లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీ నరసింహ స్వామి గర్భ గుడిలోకి వచ్చిన వర్షపు నీరు చేరింది. మాచారెడ్డి మండలం నెమిలి గుట్ట తండాలో వరి పంట నీట మునిగింది. భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో సోమవారం వర్షం దంచికొట్టింది. ఆయా జిల్లాల్లోని పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో పలువురు వాగుల్లో చిక్కుకున్నారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉన్న అధికారులు.. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టి పలువురిని రక్షించారు. కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్లు తెగిపోవడంతో ఆయా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ప్రగతి నగర్, సాయినగర్‌లోని పలు కాలనీల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. రోడ్లపై వరద నీరు పారుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో సిరిసిల్లలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా 24 గంటల ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. వర్షాల కారణంగా ఆస్తి, పంట నష్టాల వివరాలను జిల్లా యంత్రాంగానికి తెలియజేయడం కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూం ను ఏర్పాటు చేశామని తెలిపారు.