Friday, November 22, 2024

Pm Modi : పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ

కుటుంబ రాజకీయ పార్టీలు అన్ని వ్యవస్థల్లో బంధుప్రీతి, అవినీతిని ప్రోత్సహించాయయని, ప్రభుత్వ ఉద్యోగాల విషయాల్లోనూ.. ఈ విధానాన్ని పాటించాయయని, అయితే తమ ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టిందని బంధుప్రీతికి ముగింపు పలికిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరనున్న 70 వేల మందికి నియామక పత్రాలు పంపిణీ చేసిన అనంతరం మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. నియామక ప్రక్రియలో అవినీతి, బంధుప్రీతిని ప్రోత్సహిస్తూ.. కుటుంబ పార్టీలు యువతకు ద్రోహం చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ‘రేటు కార్డ్’​లతో యువత ఉద్యోగాలను దోచుకున్నాయని ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వం యువత భవిష్యత్​కు రక్షణగా నిలిచిందన్నారు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరనున్న వారికి.. దాదాపు 70 వేల మందికి మంగళవారం నియామక పత్రాలు అందచేసిన మోదీ.. అనంతరం ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడారు.

దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలను అందించడానికి ఎస్‌ఎస్‌సీ, యూపీఎస్​సీ, ఆర్‌ఆర్‌బీ వంటి అనేక సంస్థలు ఉన్నాయన్నారు. పరీక్ష ప్రక్రియను మరింత పారదర్శకంగా, సరళంగా చేయడమే ఈ సంస్థల ధ్యేయమన్నారు. ఇంతకుముందు నియామక ప్రక్రియ పూర్తి అవ్వడానికి ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పట్టేదన్నారు. ఒకవేళ ఈ నియామకాల వివాదం కోర్టుకు వెళితే.. వివాదం ముగిసేసరికి మరో రెండు లేదా 5 ఏళ్లు వృథా అయ్యేవన్నారు. వీటన్నింటి నుంచి ఇప్పుడు బయటపడ్డామని.. కొద్ది నెలల్లోనే నియామకాల ప్రక్రియ మొత్తం ఎంతో పారదర్శకంగా పూర్తవుతోందన్నారు. ప్రస్తుతం భారత్​ స్థిరంగా ఉందన్న మోదీ.. దశాబ్దం క్రితం కంటే బలంగా, సురక్షితంగా.. దేశం ఉందని నొక్కిచెప్పారు. నిర్ణయాత్మకత.. భారత ప్రభుత్వానికి గుర్తింపుగా మారిందన్నారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోనూ కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చాయని చెప్పారు. ముద్రా యోజన, స్టార్ట్ అప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా వంటి పథకాల కారణంగా స్వయం ఉపాధి అవకాశాలు కూడా యువతకు కలిగాయని మోదీ వివరించారు. మరోపక్క ఉక్రెయిన్​ యుద్ధం కారణంగా.. మన దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిందని, అయినప్పటికి ఈ సవాళ్లు అన్నింటినీ.. భారత్ అధిగమించి కొత్త శిఖరాలను అందుకుందన్నారు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలతో దేశంలోని ప్రైవేటు రంగంలో లక్షల ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రోజ్​గార్​ మేళా బీజేపీ, ఎన్​డీఎ ప్రభుత్వాలకు కొత్త గుర్తింపునిస్తోందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement