Sunday, November 17, 2024

యాదాద్రి తరహాలో రాజన్న ఆలయ పునర్నిర్మాణం.. రెండు వారాల్లో ఎములాడకు కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : యాదాద్రి తరహాలో వేములవాడ రాజన్న ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ భారీ ప్రణాళికను రూపొందించినట్టు తెలుస్తోంది. శైవ ఆలయాల్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని పునర్నిర్మించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా ఈ ఆలయాన్ని స్తపతి ఆనందసాయి సోమవారం సందర్శించి ఆలయ అధికారులతో చర్చలు జరిపారు. రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ కృతనిశ్చయంతో ఉన్నారని ఈ అంశంపై తనతో ఆయన పలుమార్లు చర్చించారని ఆనందసాయి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌తో కలిసి ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ముందు ఒకసారి స్వయంగా తాను వచ్చి ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేయాలని భావించినట్టు అందులో భాగంగానే వచ్చానని ఆయన ఆలయ అధికారులకు చెప్పారు. ఆలయ లేఅవుట్‌ను రాజరాజేశ్వర దేవస్థానం కార్యనిర్వహణాధికారి రమాదేవితో కలిసి ఆనందసాయి పరిశీలించారు. ప్రధాన ఆలయాన్ని ముట్టుకోకుండా భక్తులకు సదుపాయాలు కల్పించాలన్న ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని ఈ విధంగా పునర్‌నిర్మాణ ప్రణాళిక ఉంటుందని ఆయన తెలిపారు. మరో రెండు వారాల్లో సీఎం కేసీఆర్‌ వేములవాడ వస్తారని ఆ రోజున ఈ ఆలయ పునర్నిర్మాణంపై అధికారులు, ఆలయ అర్చకులు, ముఖ్యులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటారని ఆనందసాయి చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఈ ఆలయాన్ని సందర్శించాక నిర్మాణ పనులపై పూర్తిస్థాయి ప్రణాళిక సిద్ధం చేస్తామని ఆయన వెల్లడించారు. యాదాద్రి తరహాలోనే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం తనకు చెప్పారని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే 37 ఎకరాల సేకరణ
వేములవాడ రాజన్న ఆలయాన్ని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆలయ అభివృద్ధికి ఇప్పటికే 37 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. దక్షిణ కాశీగా బాసిల్లుతున్న వేములవాడ రాజన్న అంటే కేసీఆర్‌కు అమితమైన ప్రేమ అని తెరాస నేతలు చెబుతున్నారు. ఈ క్షేత్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని గతంలోనే ఆయన సంకల్పించారు. ముఖ్యమంత్రి హోదాలో ఇప్పటికే మూడుసార్లు రాజన్న ఆలయాన్ని కేసీఆర్‌ దర్శించారు. మూడుసార్లు కుటుంబ సమేతంగా వచ్చి కోడెను కట్టేసి స్వామివారికి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. మొదటిసారి 2015 జూన్‌ 18న వేములవాడ వచ్చిన సీఎం కేసీఆర్‌ ఏడు గంటలపాటు ఆలయంలో గడిపారు. గుడి చెరువు, ఆలయ పరిసరాలు, పట్టణంలో కలియ తిరిగారు. గుడి చెరువు, శిఖం భూములను తీసుకుని 37 ఎకరాలకు ఆలయాన్ని విస్తరించాలని అప్పట్లో అధికారులను ఆదేశించి భూ సేకరణ పూర్తి చేయాలని సూచించారు. రాజరాజేశ్వర ప్రధాన ఆలయం, స్వామివారి ప్రధాన అంతర్గత ఆలయం విస్తీర్ణం 16 గుంటల్లో ఉంది. దీన్ని 40 గుంటలకు పెంచి పునర్నిర్మించాలన్నది సీఎం కేసీఆర్‌ ఆలోచనగా తెలుస్తోంది. రూ.20 కోట్లతో రెండో ప్రాకారం నిర్మాణాలను చేపట్టేందుకు అంచనాలను సిద్ధం చేశారు. తూర్పున కళాభవనం వద్ద రెండో రాజగోపురం నిర్మాణం, ఉత్తరంవైపున కల్యాణకట్ట, ప్రసాదం కౌంటర్లు, ఓపెన్‌ శ్లాబ్‌తో పడమటి ద్వారం వరకు ఆలయంలోని అంతర్భాగాన్ని విస్తరించాలని ప్రతిపాదించారు. గుడి చెరువు ఈశాన్య భాగాన్ని విస్తరించేందుకు 90.36 కోట్లతో ప్రతిపాదనను సిద్ధం చేశారు.

నూతన కల్యాణ వేదిక
రాజన్న సన్నిధిలో శ్రీ సీతారామస్వామి, శివ కల్యాణాలు జరిపేందుకు ప్రత్యేకంగా కల్యాణ వేదికను నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అత్యంత వైభవంగా రాజన్న సన్నిధిలో జరిగే ఈ కల్యాణాలకు తెలంగాణ రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు ఉన్న మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ప్రస్తుతం కల్యాణ వేదిక లేకపోవడంతో సీతారాముల వారి కల్యాణం చైర్మన్‌ హాల్‌ ఎదుట నిర్వహిస్తున్నారు. కల్యాణానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నూతన కల్యాణ వేదికలు నిర్మించాలని తలపెట్టింది. రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు విస్తరణ పనులు చేపట్టేందుకు దేవాదాయ, రాజన్న ఆలయ బృందాలు ఇప్పటికే శృంగేరి పీఠాధిపతి వద్దకు వెళ్లి అభివృద్ధి నమూనాలను వారి ముందుంచి ఆమోదం పొందాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement