బాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించే యశ్‌రాజ్ ఫిలింస్ సంస్థ తొలి వెబ్ సిరీస్‌ను ప్రకటించింది. భోపాల్ గ్యాస్ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించబోతుంది. ఆ వెబ్ సిరీస్ పేరు ‘‘ద రైల్వే మెన్’’. శివ్ రావైల్ డైరెక్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది ఆ సంస్థ. ఆర్.మాధవన్, కేకే.మీనన్, దివ్యేందు శర్మ, ఇర్ఫాన్ ఖాన్ కొడుకైన బాబిల్ ఖాన్ నటించనున్నారు.
1984 డిసెంబర్ 2న భోపాల్ గ్యాస్ ట్రాజెడీ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మిథైల్ ఐసో సైనేట్ అనే రసాయనం విడుదలయి వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. సరిగ్గా ఘటన జరిగిన 37ఏళ్లకు యశ్‌రాజ్ ఫిలింస్ ఎంటర్టైన్మెంట్ వెబ్‌సిరీస్‌ను ప్రకటించడం విశేషం. ఈ వెబ్ సిరీస్ వచ్చే ఏడాది డిసెంబర్ 1 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రసారం కానుంది.
‘‘భోపాల్ స్టేషన్‌లోని రైల్వే కార్మికులకు నివాళిగా ఈ షోను నిర్మిస్తున్నాం. భోపాల్ గ్యాస్ ట్రాజెడీతో అనేక మంది జీవితం ప్రభావితమైంది. యశ్ రాజ్ ఫిలింస్ తరపున మంచి కథలను అభిమానులకు చెప్పాలనుకుంటున్నాం. ఈ ఘటన జరిగి 37ఏళ్లైంది. అందుకే వారికి నివాళులుగా ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నాం. ఈ కథ ప్రతి ఒక్కరికి తెలియాలి’’ అని యశ్‌రాజ్ ఫిలింస్‌కు చెందిన ప్రతినిధులు చెబుతున్నారు.