బడా సేట్ల వికృత క్రీడతో అమాయక గిరిజనులతో పాటు, మధ్య, ఎగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన గిరిజనేతరులు బలవుతున్నారు. ఛత్తీస్‌గఢ్, ఏపీలో విలీనమైన చింతూరు వంటి ప్రాంతాల గిరిజనుల పేరిట తక్కువ ధరకు భూములు కొనుగోలు చేస్తున్న బడాబాబులు, యథేచ్ఛగా రియల్ వ్యాపారం చేస్తూ అప్పనంగా కోట్లు పోగేసుకుంటున్నారు. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు వాటిని కొనుగోళ్లు చేస్తున్న మధ్య, ఎగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు ఆర్థికంగా, మానసికంగా చితికిపోతున్నారు. 1/70 వంటి ఏజెన్సీ చట్టాలు అమలు జరుగుతున్న ఈ ప్రాంతంలో బడా సేట్ల రియల్ వ్యాపారానికి రెవెన్యూ అధికారులు అండగా నిలుస్తున్నట్లు బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి.
(ప్రభ న్యూస్ రూరల్ బ్యూరో, ఉమ్మడి ఖమ్మం జిల్లా)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సబ్ డివిజన్‌లో కాలకూట విషం కక్కే కాలనాగులా మారిన రియల్ మాఫియా బుసలు కొడుతోంది. 1/70 వంటి గిరిజన చట్టాలు అమలు జరుగుతున్న ప్రాంతంలో గిరిజనేతరులైన బడా వ్యాపారులు రియల్ వ్యాపారం చేస్తూ, అక్రమాలకు తెగబడుతున్నారు. చట్టాల్లోని లోపాలను తమకు అనుకూలంగా మార్చుకొంటున్న సదరు అక్రమార్కులు, గిరిజనుల పేరుతోనే రియల్ వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్, చింతూరు గిరిజనుల పేరుతో కొనుగోళ్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సబ్ డివిజన్ పరిధిలోని మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాల పరిధిలో గిరిజనుల భూములను కొనుగోలు చేస్తున్న రియల్టర్లు, ఆయా భూములను 1/70 చట్టంలో ఉన్న ఆస్తి బదలాయింపును అవకాశంగా మార్చుకొని చత్తీస్‌ఘడ్, ఏపీలో విలీనమైన చింతూరు వంటి ప్రాంతాల పరిధిలోని గిరిజనుల పేరున రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. అందుకోసం వారి వేలిముద్రలు, ఆధార్ కార్డులను వినియోగించుకుంటూ వారికి, రూ.5 నుంచి 10 వేల వరకు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు రెవెన్యూ శాఖలో పని చేస్తున్న అవినీతి అధికారులు అండగా నిలుస్తుండటంతో ఆయా క్రయవిక్రయాలు నిరాటంకంగా జరిగిపోతున్నాయి. కేవలం 5- 10 వేలను చెల్లించి, ఆయా భూముల యజమానులుగా పేర్కొంటున్న వారిని బురిడీ కొట్టించి, ఓపెన్ ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. కేవలం వేలిముద్రలు వేయడం తప్ప, వారి పేరిట ఏం జరుగుతుందో తెలియని గిరిజనులు అసలు ఎక్కడ భూమి కొంటున్నారో, దాని సరిహద్దులు ఏమిటో కూడా తెలియకుండానే రికార్డుల్లో యజమానులుగా మారిపోతున్నారు. వీరి పేరిట ఉన్న రికార్డుల ఆధారంగా భూములు కొనుగోళ్లు చేస్తున్న వారికి కూడా అసలు భూ యజమానులు ఎవరో తెలియని దుస్థితి నెలకొంటోంది.
కొనుగోలుదారులకూ తప్పని అవస్థలు
సొంతింటి కల నెరవేర్చుకునేందుకు పైసా పైసా కూడబెట్టుకున్న సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు, రియల్ వ్యాపారుల ప్రచారంతో భూములు కొనుగోలు చేస్తున్నారు. రియల్ వ్యాపారుల మాయలో పడి ఉన్నదంతా ఊడ్చి కొనుగోలు చేసిన భూమిని తమ పేరిట మార్చుకునేందుకు సైతం అవకాశం లేకపోవడంతో ఇంటి నిర్మాణం, కరెంట్ మీటర్ మొదలుకొని, ఇంటి పన్ను వచ్చే వరకు తీవ్ర మానసిక ఆందోళనతో గడపాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే స్థానికంగా సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్న కొంతమంది వ్యక్తులు, ఆయా భూములను కొనుగోలు చేసిన వారిని భయబ్రాంతులకు గురిచేస్తూ, గిరిజనుల భూములను ఎలా కొంటారంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారిని నయానో భయానో లొంగదీసుకొని, అందినంతా దండుకుంటున్నారు. ఈ క్రమంలో తాము చెల్లిస్తున్న లంచాలు భూమి కొనుగోలు చేసిన దానికంటే రెట్టింపు అవుతున్నట్లు బాధితులు వాపోతున్నారు.
అండగా నిలుస్తున్న రెవెన్యూ అధికారులు
గిరిజన ప్రాంతమైన మణుగూరు సబ్ డివిజన్‌లో భూముల పేరిట జరిగే ప్రతి అక్రమానికి రెవెన్యూ అధికారులే అండగా నిలుస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కొంతమంది బడా సేట్లతో కలిసి, వారు భూక్రయవిక్రయాలకు తోడ్పాటు నందిస్తున్నట్లు బహిరంగంగానే వినిపిస్తోంది. ఇతర ప్రాంతాల గిరిజనుల పేరిట భూములు మార్చడం, అమ్మకాలు జరుగుతున్నప్పుడు ఏం తెలియనట్లు నటించడం, సెటిల్‌మెంట్లకు పాల్పడే వారికి సమాచారమిచ్చి, భూముల కొనుగోలు దారులను సైతం ఏమీ చేయలేమంటూ నిస్సహాయస్థితికి నెట్టి, అడ్డంగా దండుకోవడం వంటి కార్యకలాపాలు ఈ ప్రాంతంలో నిత్యకృత్యంగా మారినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ రికార్డుల్లోని లోపాలను ఆధారం చేసుకొని రెవెన్యూ అధికారులు కొందరు అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
గిరిజనులు, గిరిజనేతరుల మధ్య సోదరభావం
1/70 వంటి గిరిజన చట్టాలు అమలులో ఉన్నప్పటికీ, ఈ ప్రాంత గిరిజనులు, ఏనాడూ గిరిజనేతరులను ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు లేవు. సొంతింటి నిర్మాణాలకు, సొంత వ్యాపారాలకు ఏనాడూ అడ్డుపడిన దాఖలాలు కూడా లేవు. అయితే గిరిజనుల పేరుతో మాయ చేయిస్తూ, మోసాలకు పాల్పడుతూ రియల్ వ్యాపారం సాగిస్తున్న తీరు, భూముల అమ్మకాలు, తరువాత మొహం చాటేస్తున్న తీరు శాపంగా మారుతోంది. దీంతో ఏ ప్రాంతానికి చెందిన వారి పేరుతో ఉన్న భూమిని కొంటున్నామో తెలియని అమాయకులు నిండా మునుగుతున్నారు. పనిలో పనిగా సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్న వారి తీరుతో గిరిజనులంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. బడా రియల్టర్ల దాష్టికంతో ఏళ్లుగా కలిసున్న గిరిజనులు, గిరిజనేతరుల మధ్య వైషమ్యాలు పెరిగి పోతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ చూపి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకొని, గిరిజనులు, గిరిజనేతరులు సామరస్యపూర్వకంగా మెలిగే ప్రాంతంలో సమస్యలు సృష్టి స్తున్న వారికి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.