హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో రాజధాని హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలని స్తున్నాయి. ఐటీ రంగాన్ని రాష్ట్రవ్యాప్తం చేసేందుకు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐటీ హబ్‌లు ఆయా పట్టణాల్లో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక నగరాలైన మహబూబ్‌నగర్, నల్గొండ, రామ గుండం, వనపర్తి, సిద్ధిపేటలో కూడా ఐటీ హబ్‌లు ఏర్పాటు చేసేందుకు చర్యలను ప్రభుత్వం ఇటీవల వేగవంతం చేసింది.
ఆయా పట్టణాల్లో ఏర్పాటు చేసిన, ఏర్పాటవుతున్న ఐటీ హబ్‌లు, ఇండస్ట్రియల్ పార్కుల కారణంగా అక్కడి భూముల విలువలు ఒక్కసారిగా పెరగడంతో పాటు నిర్మాణ రంగం కూడా ఊపందుకున్నట్లు పరిశ్రమల శాఖవర్గాలు చెబుతున్నాయి. గడిచిన రెండేళ్లలోనే రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణపారిశ్రామిక మౌలికసదుపాయాల కల్పనసంస్థ(టీఎస్‌ఐఐసీ) 10 ఇండస్ట్రియల్ పార్కుల్లో 810 ఎకరాలను 453 పరిశ్రమలకు కేటాయించింది. ఈ పార్కుల్లో స్టార్టప్‌లకు, ఐటీ కంపెనీల కోసం ఏర్పాటు చేసిన ఐటీ హబ్‌లు కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ పారి శ్రామిక పార్కుల్లో వచ్చిన పెట్టుబడుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఆర్థిక సంవత్సరంలోనే 45 వేల వరకు ప్రత్యక్ష ఉద్యోగాలు లభించినట్లు అంచనాలున్నాయి. ఈ ఉద్యోగాలకు రెండున్నర రెట్లు పరోక్షంగా ఉపాధి లభించినట్లు అధికారులు లెక్కలు కడుతున్నారు. ఈ తరహాలో అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుండడంతో రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కొత్త గృహాలకు డిమాండ్ ఏర్పడు తోందని క్రెడాయ్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి.
గతంలో హైదరాబాద్ నగరంలో ఇంటి స్థలం లేదా ఇల్లు కొనుగోలు చేద్దామనుకున్న వారిలో ఎక్కువ మంది ప్రస్తుతం వారి వారి పట్టణాలకే పరిమితమవుతున్నారని క్రెడాయ్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఏర్పడినతర్వాత జరిగిన పారిశ్రామిక వికేంద్రీకరణ దీనికి కారణమని అవి పేర్కొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు హైదరాబాద్‌లో ఇళ్ల కొనుగోలు సామాన్యులకు రోజురోజుకు అందుబాటులో లేకుండా పోవడంతో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఇళ్ల డిమాండ్‌కు కారణమైందని రియల్ ఎస్టేట్ కంపెనీల యజమానులు విశ్లేషిస్తున్నారు.
గతంలో రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి ద్వితీయ శ్రేణి నగరాలకే పరిమితమైన అపార్ట్‌మెంట్, విల్లాల సంస్కృతి ప్రస్తుతం రామగుండం, మంచిర్యాల, జహీరాబాద్, నల్గొండ, సూర్యాపేట లాంటిచోట్ల కూడా జోరందుకుందని వారు చెబుతున్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఇటీవలి కాలంలో ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన వారు కూడా హైదరాబాద్‌లో ఇళ్లు కొనుగోలు చేయడం కంటే వారి వారి సొంత పట్టణాల్లో శేష జీవితం గడిపేందుకే మొగ్గు చూపడం
కనిపిస్తోందని రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చెబుతున్నారు. మారుతున్న జీవన శైలితో పాటు చిన్న నగరాల్లోనూ 24 గంటల కరెంటుతో పాటు నిరంతరాయమైన మంచి నీటి సరఫరా, ప్రభుత్వ, ప్రైవేటురంగంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం లాంటి కారణాల వల్లే సీనియర్ సిటిజన్స్ ఈ నగరాలలో నివసించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారు చెబుతున్నారు. ఓ వైపు పారిశ్రామిక అభివృద్ధితో ఉపాధి అవకాశాలు పెరగడం మరోవైపు కొనుగోలుదారుల ప్రాధాన్యాలు మారుతుండడం తో రాష్ట్రంలోని చిన్న పట్టణాల్లో రియాల్టి రంగం ఊపు మీదకు వచ్చినట్లు స్పష్టమవుతోంది.