ఈ మధ్యనే ప్రాచుర్యంలోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్. ఈ నథింగ్ ఫోన్1ని త్వరలోనే లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది కంపెనీ. దీన్ని సొంతం చేసుకునేందుకు ప్రీ ఆర్డర్ బుకింగ్స్ ఇండియాలో ప్రారంభమయ్యాయి. ప్రీ ఆర్డర్ పాస్ పొందేందుకు కస్టమర్లకు ఇన్‌వైట్ కోడ్ అవసరం. కాగా, ఈ ప్రీ-ఆర్డర్ పాస్ అందరికీ లభించదని, తొలుత తమ ప్రైవేట్ కస్టమర్లు ప్రీ ఆర్డర్ పాస్‌ను కొనుగోలు చేస్తారని బ్లాగ్ పోస్ట్‌లో కంపెనీ వెల్లడించింది. తమ రెగ్యులర్ కస్టమర్ కమ్యూనిటీకి చెందని వారు పాస్‌ను పొందలేరని, వారు ఇన్‌వైట్ కోడ్ కోసం వెయిట్ లిస్ట్‌లో ఉండాలని తెలిపింది.
వెయిట్ లిస్ట్‌లో పేరు నమోదు చేసుకునేందుకు కస్టమర్లు తమ అధికారిక నథింగ్ వెబ్‌సైట్‌ని లాగిన్ కావాలని కంపెనీ పేర్కొంది. రిజిస్టర్ చేసుకున్న కస్టమర్లకు ఈమెయిల్‌లో నోటిపికేషన్ వస్తుంది. ఆపై ఆయా కస్టమర్లు జూన్ 30లోగా ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్విటేషన్ కోడ్‌ను ఎంటర్ చేసి సెక్యూరిటీ డిపాజిట్ కింద 2వేల రూపాయలు చెల్లించాలి. ఈ మొత్తంతో నథింగ్ ఫోన్ 1 యాక్సెసరీపై ప్రత్యేక రాయితీలు, ఎక్స్లూజివ్ ప్రీ ఆర్డర్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.
కాగా, జులై 12న యూజర్లు ఫ్లిప్‌కార్ట్‌లో లాగిన్ అయి ఏ మోడల్‌ను ఎంచుకుని ఆ మొత్తం చెల్లించాలి. ఆ సమయంలో యూజర్లు డివైజ్ ధరను పూర్తిగా చెల్లించాలి. తుది ధర నుంచి ప్రీ ఆర్డర్ పాస్ కోసం యూజర్ చెల్లించిన రెండు వేల రూపాయలను తగ్గిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. అయితే.. కస్టమర్లు ఆర్డర్‌ను నిర్ధారించేందుకు కేవలం 7 రోజుల సమయం ఉంటుంది. నథింగ్ ఫోన్ 1 తమ తొలి స్మార్ట్‌పోన్ కావడంతో సరఫరాలు పరిమితంగా ఉన్నందున ఇతరుల కంటే ముందుగా కమ్యూనిటీ సభ్యులకు ఈ డివైజ్‌ను అందించాలనే ఉద్దేశంతో ప్రీ ఆర్డర్ పాస్‌ల ప్రక్రియ చేపట్టామని కంపెనీ తెలిపింది. భారత్‌లో నథింగ్ పోన్ 1 ధర దాదాపు రూ. 40,000 నుంచి రూ. 50,000 మధ్య ఉండే చాన్స్ ఉందని టెక్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.