Sunday, November 24, 2024

Ready to open – వెయిటింగ్‌లేని రైలు జ‌ర్నీ! అందుబాటులోకి చ‌ర్ల‌ప‌ల్లి టెర్మిన‌ల్

మ‌హా నగ‌రికి స‌రికొత్త హంగులు
రూపుదిద్దుకున్న కొత్త రైల్వే స్టేష‌న్‌
విమానాశ్ర‌యాల‌ను త‌లిపించేలా నిర్మాణం
అన్నింటా అంత‌ర్జాతీయ ప్ర‌మాణాలు
అధునాత‌న సౌక‌ర్యాల ఏర్పాటు
ఫుడ్ కోర్టులు.. రెస్టారెంట్లు..
ఏడు లిఫ్ట్‌లు.. ఆరు ఎస్క‌లేట‌ర్లు
తొమ్మిది ప్లాట్ ఫామ్స్‌తో ప్ర‌యాణికుల‌కు సేవ‌లు
హైద‌రాబాద్ సంస్కృతి ప్ర‌తిబింబించే చిత్రాలు
సికింద్రాబాద్‌, నాంప‌ల్లి, కాచిగూడ స్టేష‌న్ల‌పై త‌గ్గ‌నున్న ఒత్తిడి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : హైద‌రాబాద్ రైల్వే ప్ర‌యాణికుల సేవ‌ల్లో నాలుగో టెర్మిన‌ల్‌గా చ‌ర్ల‌ప‌ల్లి అందుబాటులోకి రానున్న‌ది. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో రూపుదిద్దుకుంటున్న చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే స్టేష‌న్ మ‌రో రెండు నెల‌లోపు ప్రారంభం కానున్న‌ది. ఈ టెర్మిన‌ల్ అందుబాటులోకి వ‌స్తే సికింద్రాబాద్‌, హైద‌రాబాద్‌, కాచిగూడ రైల్వే స్టేష‌న్ల‌పై ఒత్తిడి త‌గ్గ‌నుంది. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు ఈ మూడు టెర్మిన‌ల్ ద్వారా రోజుకు 227 రైళ్లు సేవ‌లు అందిస్తున్నాయి. మ‌రికొన్ని కొత్త‌గా ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయి. 1874లో ఏర్పాటు చేసిన‌ సికింద్రాబాద్ స్టేష‌న్ అతి పెద్ద‌ది. ప‌ది ప్లాట్ ఫామ్స్‌తో ప్ర‌యాణికులు సేవ‌లు అందిస్తున్న‌ది. ప్లాట్ ఫామ్ ఖాళీ లేక‌పోవ‌డంతో అనేక రైళ్లు గంట వ‌ర‌కు అవుటర్‌లో వేచి ఉండాల్సిన ప‌రిస్థ‌తి ఏర్ప‌డింది.

- Advertisement -

నాంప‌ల్లికి ప్ర‌త్యామ్నాయం..

1907లో నిర్మించిన నాంప‌ల్లి స్టేష‌న్ ప్ర‌త్యామ్నాయం ఏర్పాటు చేసిన‌ప్ప‌టికీ సికింద్రాబాద్ మీదుగా రైళ్ల రాక‌పోక‌లు చేయాల్సి రావ‌డంతో సికింద్రాబాద్‌కు ఒత్తిడి త‌గ్గ‌లేదు. 1916లో నిర్మించిన కాచిగూడ రైల్వే స్టేష‌న్‌కు ఇటీవ‌ల కాలంలో కొన్ని రైళ్లు మ‌ళ్లించారు. అయితే ఎక్కువ రైళ్లు మౌలాలి, మ‌ల్కాజ్‌గిరి మీదుగా మ‌ళ్లించ‌డం వ‌ల్ల మౌలాలి స్టేష‌న్ అవుట‌ర్‌లో రైళ్లు నిలిచిపోవ‌ల‌సి ఉంటుంది. సికింద్రాబాద్‌కు 15 కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే స్టేష‌న్ అందుబాటులోకి వ‌స్తే ఈ మూడు స్టేష‌న్ల‌పై ఒత్తిడి పూర్తిగా త‌గ్గుతుంద‌ని రైల్వే అధికారుల అంచ‌నా.

రూ.430 కోట్ల‌తో అభివృద్ధి ప‌నులు

చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే స్టేష‌న్‌ను రూ.430 కోట్ల‌తో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టారు. అధునాతన‌ సౌక‌ర్యాలు క‌ల్పించారు. స్టేషన్‌లో నాలుగు అదనపు హై-లెవల్ ప్లాట్‌ఫామ్‌లు నిర్మించారు. ఇప్పటికే ఉన్న 5 ప్లాట్‌ఫామ్‌లు కూడా పూర్తి పొడవు రైళ్లను ఉంచడానికి విస్త‌రించారు. రెండు కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించారు. ఇందులో ఒకటి 12 మీటర్ల వెడల్పు, మరొకటి 6 మీటర్ల వెడల్పు ఉంటుంది. మొత్తం 9 ప్లాట్‌ఫామ్‌ల ఏర్పాటు చేశారు. ఒక ఎయిర్ కండిష‌న్ వెయిటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేశారు. దేశంలో ఇది రెండో ఎయిర్ కండిష‌న్ వెయిటింగ్ హాల్ ఉన్న స్టేష‌న్‌గా చ‌ర్ల‌ప‌ల్లి రికార్డు సృష్టించ‌బోతుంది.

ద‌క్షిణ మ‌ధ్య రైల్వే జోన్‌లో ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన స్టేష‌న్‌…

హైదరాబాద్ నగరంలో అభివృద్ధి చేయబడిన నాల్గవ ప్రధాన సెంట్రల్ రైల్వే టెర్మినల్ చర్లపల్లి రైల్వే స్టేషన్ ద‌క్షిణ మ‌ధ్య రైల్వే జోన్‌కు ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైంది. ఈ స్టేష‌న్‌లోకి తొలి అడుగుపెట్ట‌గానే విమానాశ్ర‌యాల‌ను త‌ల‌పిస్తుంది. ఇందులో ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్ ప్ర‌తి ప్ర‌యాణికుడిని ఆక‌ట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. ఇందులో హైద‌రాబాద్ సంస్కృతిని ప్ర‌తిబింబించే పాల‌పిట్ట‌, బ‌తుక‌మ్మ‌, గోల్కొండ‌, చార్మిన‌ర్ చిత్రాలు కూడా ప్ర‌యాణికుల‌కు ద‌ర్శ‌న‌మిస్తాయి. అలాగే మ‌హిళ‌ల వెయిటింగ్ హాల్‌లో వివిధ ర‌కాల మ‌హిళ‌లు చిత్ర‌క‌ళ ఉంటుంది. స్టార్‌హోట‌ల్ త‌ల‌పించే విధంగా రెస్టారెంట్ ఉంటుంది. ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ర్షించే విధంగా ఫుడ్ కోర్టు ఏర్పాటు చేశారు.

ఇత‌ర ప్రాంతాల‌తో క‌నెక్టివిటీ…
సికింద్రాబాద్‌కు తూర్పు వైపు ఉన్న‌చ‌ర్ల ప‌ల్లి రైల్వే టెర్మిన‌ల్‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, ఒడిశా, ప‌శ్చిమ బెంగాల్‌తోపాటు ఉత్త‌ర భార‌త‌దేశంలో ఉన్న న్యూఢిల్లీ, అయోధ్య‌, వార‌ణాసి త‌దిత‌ర ప్రాంతాల రైళ్ల క‌నెక్టివిటి ఎక్కువ‌గా ఉన్నాయి. ఈస్టేష‌న్ అందుబాటులోకి వ‌స్తే మొద‌టి ద‌శ‌లో 25 జ‌త‌ల రైళ్ల వ‌ర‌కు చ‌ర్ల‌ప‌ల్లిలో నిలిపి వేసేలా రైల్వేఅధికారులు ప్ర‌ణాళిక రూపొందిస్తున్నారు. దీంతో చ‌ర్ల‌ప‌ల్లిలో నిలుపు చేసే అనేక రైళ్లు సికింద్రాబాద్‌కు రాకుండా చ‌ర్య‌లు తీసుకునేలా ప్ర‌ణాళిక‌లు ఉంటాయి. దీనివ‌ల్ల సికింద్రాబాద్‌, హైద‌రాబాద్‌, కాచిగూడ‌ల‌కు ఒత్తిడి బాగా త‌గ్గుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ మాదిరిగా ఇక్క‌డ కూడా కోచ్‌లు నిర్వ‌హ‌ణ సౌక‌ర్యాలు క‌ల్పించారు. ఉత్త‌ర భార‌త‌దేశం నుంచి, అలాగే ఆంధ్ర‌, ఒడిశా, ప‌శ్చిమ బెంగాల్ నుంచి వ‌చ్చే ప‌లు రైళ్ల ను సికింద్రాబాద్ వ‌ర‌కూ పంపించ‌కుండా చ‌ర్ల‌ప‌ల్లి నిర్వ‌హ‌ణ చేస్తారు.

ఇదే అస‌లు స‌మ‌స్య‌…

అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో నిర్మించిన చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే టెర్మిన‌ల్‌కు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల నుంచి ర‌వాణ సౌక‌ర్యాలు లేక‌పోవ‌డ‌మే అస‌లు స‌మ‌స్య‌. సికింద్రాబాద్, మ‌ల్కాజ్‌గిరి త‌దిత‌ర ప్రాంతాల నుంచి చ‌ర్ల‌ప‌ల్లి కి సుమారు 15 కిలోమీట‌ర్లు దూరం ఉంటుంది. అలాగే హైటెక్ సిటీ, గ‌చ్చిబౌలి, కొండ‌పూర్‌, మ‌ణికొండ‌, కేపీహెచ్‌బీ, చార్మిన‌ర్‌, ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి సుమారు 25 నుంచి 35 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ స‌మ‌స్య అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. మెట్రో సౌక‌ర్యం ఉన్న ప్రాంతాల త‌ప్ప మిగిలిన ప్రాంతాల నుంచి సికింద్రాబాద్‌కు చేరుకోవాలంటే గంట‌కుపైగా ప‌డుతుంది. ఈ త‌రుణంలో చ‌ర్ల‌ప‌ల్లి స్టేష‌న్‌కు వెళ్ల‌డానికి ప్ర‌యాణికుల‌కు అవ‌స్థ‌లు త‌ప్ప‌వు. అయితే ఉన్న‌త శ్రేణి ప్ర‌యాణికులు క్యాబ్‌లో చేరుకోవ‌చ్చు. సామాన్య ప్ర‌యాణికుల‌కు రోడ్డు ర‌వాణా సౌక‌ర్యాలు పెంచే బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకోవాలి. అన్ని ప్రాంతాల నుంచి బ‌స్సు సౌక‌ర్యాలు పెంచవ‌ల‌సిన బాధ్య‌త ఉంది. అలాగే రైల్వే శాఖ కూడా చ‌ర్ల ప‌ల్లి నుంచి ఎంఎంఎస్ సేవ‌లు కూడా పెంచాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement