ఈ బాలుడి పేరు విజయ కుమార్. తల్లిదండ్రులు మల్లెల వెంకటేష్, బుజ్జమ్మ. వీరిది మహబూబ్‌నగర్ జిల్లాలోని కాకర్లపాడ్ గ్రామం. ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న ఈ బాలుడి ఆర్థిక పరిస్థితి బాగాలేక బడికి వెళ్లడం లేదు. దీంతో మైసమ్మ వద్ద కూల్ డ్రింక్స్ అమ్ముతున్నాడు. ఆదివారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మైసమ్మ వద్ద పూజకు వచ్చారు. కూల్ డ్రింక్ అమ్ముతున్న బాలుడు విజయ కుమార్ మంత్రి దగ్గరకు వెళ్లి చేయిపట్టుకుని ‘‘నన్ను చదివించండి సర్’’ అంటూ ఏడుపు అందుకున్నాడు. పిల్లవాడి కన్నీటికి చలించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తన వాహనంలో ఎక్కించుకుని వివరాలు తెలుసుకున్నారు.
అక్కడికక్కడే పట్టణంలో రిషి విద్యాలయం వాళ్లకు ఫోన్ చేసి బాలుడిని ఆరో తరగతిలో చేర్చుకుని హాస్టల్ వసతితో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని.. ఎంత ఖర్చు అయినా తాను భరిస్తానని తెలిపారు. బాలుడికి కావాల్సిన దుస్తులు, ఇతర వస్తువులన్నీ కొనాలని తన వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు. బాలుడి జీవితంలో స్థిరపడేలా చేస్తామని అంత వరకు తానే బాధ్యత తీసుకుంటానని మంత్రి తెలిపారు. తన సొంత కుమారుడిలా విద్యాబుద్ధులు అందిస్తామని తెలిపారు. అప్పటికప్పుడే బాలుడికి దుస్తులు, పుస్తకాలు, బూట్లు, ఇతర వస్తువులన్నీ ఇప్పించారు. బాలుడి తల్లితండ్రులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.