Friday, November 22, 2024

ఆర్ బి ఐకి ప‌ట్ట‌ని ఖాతాదారులు – లాభాల‌కే పెద్ద పీట‌

న్యూఢిల్లి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – స్వాతంత్య్రమొచ్చిన తొలినాళ్ళలో భారతీయ బ్యాంకింగ్‌ రంగం మొత్తం కొన్ని సంపన్న కుటుంబాల అధీనంలో ఉం డేది. పేద, మధ్యతరగతి ప్రజలు బ్యాంకుల్లో మదుపు చేసిన సొమ్మును ఆయా సంపన్న కుటుంబాలు తమ వ్యాపార, పారిశ్రామిక ప్రయోజనాలకు మాత్రమే పెట్టుబడులుగా వినియోగించే వారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో బ్యాంకుల జాతీయకరణ జరిగింది. అప్పటి నుంచి బ్యాంకులు ప్రజలందరికీ చేరువయ్యాయి. కొన్నాళ్ళ పాటు బ్యాంకులు పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్వావలంబన పథకాలకు ఉదారంగానే రుణాలిచ్చాయి. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆర్థిక వెన్నుదన్నుగా నిల్చాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, సహకార రంగాల్లోని బ్యాంకులతో పాటు ఇక్కడ నెలకొల్పబడ్డ విదేశీ బ్యాంకుల శాఖలకు సంబంధించి కూడా దేశీయంగా దిశానిర్దేశం చేసే అధికారం రిజర్వ్‌బ్యాంక్‌కు దఖలు చేయబడింది. ఒకప్పుడు ఈ బ్యాంకుల రోజువారి కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ప్రజల ధరావతులకు భద్రత కల్పించే బాధ్యతను మాత్రమే రిజర్వ్‌బ్యాంక్‌ నిర్వహించేది. కానీ రాన్రాను రిజర్వ్‌బ్యాంక్‌ పాత్ర అపరిమితంగా మారిం ది. భారత పార్లమెంట్‌ రిజర్వ్‌ బ్యాంక్‌కు తిరుగులేని అధికారాలు కట్టబెట్టింది. దీంతో ఈ దేశంలో మొత్తం బ్యాంకింగ్‌ వ్యవస్థ అంతా రిజర్వ్‌బ్యాంక్‌ గుప్పెట్లోనే ఉంది. బ్యాంకులతో పాటు ఆర్థిక వ్యవస్థలన్నీ రిజర్వ్‌బ్యాంక్‌ చెప్పుచేతలకనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రిజర్వ్‌బ్యాంక్‌ ఖాతాదార్ల ప్రయోజనాల కంటే బ్యాంకుల ఆర్థిక లాభాలకే పెద్దపీటేస్తోంది. ఓ వైపు భారతీయ బ్యాంకులన్నీ తమ వార్షిక నివేదికల్లో భారీగా లాభాల్ని ప్రదర్శిస్తున్నాయి. అయినా రుణగ్రహీతల నుంచి వసూలు చేసే వడ్డీరేట్లను రిజర్వ్‌బ్యాంక్‌ తరచూ పెంచుతోం ది. అదికూడా ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండానే వడ్డీరేట్ల పెంపు జరుగుతోంది. రిజర్వ్‌బ్యాంక్‌ పేరు చె ప్పి ఆర్థిక సంస్థలైన ఎల్‌ఐసీ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ, సహకార బ్యాంకులన్నీ రాత్రికి రాత్రే వడ్డీరేట్లు పెంచేస్తున్నాయి. దీంతో బకాయిదార్లు ఊహించిన మొత్తం కంటే అధికంగా చెల్లించాల్సి వస్తోంది. ఇది వారిపై అదనపు భారాన్ని మోపుతోంది.
కొవిడ్‌ సమయంలో ప్రభుత్వం రుణాల చెల్లింపునకు కొంత వెసులుబాటు ఇచ్చింది. తొలుత ఆరు మాసాలపాటు వాయిదాల చెల్లింపును వాయిదా వేసింది.

అలాగే కొవిడ్‌ నష్టాల నుంచి గట్టెక్కేందుకు వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు అదనంగా రుణాలు మంజూరు చేసింది. చేసే సమయంలో నిర్ణీత వడ్డీ శాతాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించింది. దీంతో పారిశ్రామిక, వ్యాపారవేత్తలు ప్రభుత్వ ఆలోచనల్ని ప్రశంస లతో ముంచెత్తారు. తమ అవసరాలకనుగుణంగా ఆస్తుల్ని హామీ పెట్టి రుణాలు పొందారు. రుణాల మంజూరు సమ యంలో నాలుగు శాతం మాత్రమే వడ్డీగా రిజర్వ్‌బ్యాంక్‌ ప్రకటించింది. పైగా కొవిడ్‌ నష్టాల నుంచి భారతీయ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే క్రమంలో దీన్నొక ప్రజాకర్షక విధానంగా చెప్పుకుంది. కాగా ఇప్పుడు అనూహ్యంగా ఈ రుణాలపై వడ్డీరేట్లను రిజర్వ్‌బ్యాంక్‌ పెంచేసింది. కేవలం బ్యాంకుల నుంచే కాదు.. ఎల్‌ఐసీ వంటి ఇతర ఆర్థిక సంస్థల నుంచి పొందిన రుణాలపై కూడా ఈ వడ్డీరేట్ల పెంపు వర్తిస్తోం ది. ఈ పెంపుతో బకాయిదార్లు నెలనెలా చెల్లించాల్సిన అసలు, వడ్డీల మొత్తంతో కూడిన వాయిదాల ఆర్థిక భారం అనూహ్యంగా పెరిగింది. దీనిపై ప్రశ్నించేందుకు వీల్లేదు. కనీసం ముందస్తు సమాచారం లేదన్నా పట్టించుకునే నాధుడు లేడు. పైగా సకాలంలో చెల్లింపులు జరపలేదంటూ బకాయిదార్లను ఎన్‌పీఎలుగా ప్రకటించి తనఖా పెట్టిన ఆస్తుల్ని బహిరంగవేలం వేసేందుకు సిద్దపడుతున్నారు. ఏ బ్యాంక్‌ లేదా ఆర్థిక సంస్థ అయినా రిజర్వ్‌బ్యాంక్‌ ఆదేశాలకు అనుగుణంగానే నడవాల్సిన పరిస్థితిని వివరిస్తున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాలకనుగుణంగానే అదాని వంటి పారిశ్రామిక, వ్యాపార దిగ్గజ సంస్థలకు తాము ఎటువంటి హామీల్లేకుండా వేలూ, లక్షల కోట్లను రుణాలుగా ఇవ్వాల్సి వస్తోందంటూ సాక్షాత్తు ఎల్‌ఐసీ, స్టేట్‌బ్యాంక్‌ ఇండియా వంటి సంస్థలు ప్రకటించడం పేదలు మదుపు చేసిన సొమ్ముపై రిజర్వ్‌బ్యాంక్‌ అపరిమిత అధికార పెత్తనానికి ఉదాహరణగా పేర్కొంటున్నారు.

ఈ విధానాలతో రిజర్వ్‌బ్యాంక్‌ విమర్శల పాలౌతోంది. ఖాతాదార్ల ప్రయోజనాల కంటే బ్యాంకులకు మరింత లాభా లు రాబట్టే లక్ష్యం తప్ప రిజర్వ్‌బ్యాంక్‌ మరేది పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ బకాయిదార్లు మండిపడుతున్నా రు. వాస్తవానికి ప్రజల ఆర్థిక అవసరాల్ని తీర్చడంతో పాటు వారికి ఆర్థిక రక్షణ కలిగించే లక్ష్యంతోనే రిజర్వ్‌బ్యాంక్‌ ఏర్పాటైంది. కానీ ఇప్పుడు ఆవిర్భావ లక్ష్యం నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ పక్కకు జరిగింది. ఓ పెద్ద వ్యాపార సంస్థగా మారింది. ధరావతులపై ఎంత శాతం వడ్డీలివ్వాలి.. బకాయిదార్ల నుంచి ఏ మేరకు వడ్డీ ముక్కుపిండి వసూలు చేయాలన్న దిశానిర్దేశాలకే రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రాధాన్యతని స్తోంది. అంతర్జాతీయంగా రూపాయి మారకపు విలువను రక్షించడంతో పాటు దేశీయ ఆర్థిక వ్యవస్థల బలోపతం దిశగా చర్యలు చేపట్టాల్సిన రిజర్వ్‌బ్యాంక్‌ ఇప్పుడు ఖాతాదా ర్లను వేధించేందుకు సరికొత్త ఆలోచనలు చేస్తోంది.

భారత్‌లో వేదకాలం నుంచే బ్యాంకింగ్‌ వ్యవస్థ అమల్లో ఉంది. వేదాల్లో కూడా రుణలేఖ్యం అన్నపదం కనిపిస్తోంది. రుణలేఖ్యం అంటే రుణపత్రం. అలాగే కోసీదుడు అన్న పదం కూడా వేదాల్లో ఉంటుంది. కోసీదుడంటే నగదిచ్చి వడ్డీ తీసుకునే వ్యాపారి అని అర్థం. ఈ రెండు సంస్కృత పదాలు. వేదాల్లో శతైక వృద్ధిని ధర్మసమ్మతంగా పేర్కొన్నారు. మనుస్మృతిలో కూడా వడ్డీరేట్ల ప్రస్తావన ఉంటుంది. వడ్డీరేట్లను ముందస్తు సమాచారం లేకుండా పెంచడం లేక నిర్ణీత స్థాయిని మించి వసూలు చేయడాన్ని వేదాల్లో పాపంగా పరిగణించబడింది.

భారత్‌లో రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటుకు డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ ఆలోచనలే పునాదులేశాయి. ఆయన విద్యార్థి దశలోనే ”ది ప్రాబ్లెమ్‌ ఆఫ్‌ రుపీ” అనే పుస్తకాన్ని వెలువరించారు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో డాక్టరేట్‌ డిగ్రీ కోసం డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ సమర్పించిన పరిశోధనా పత్రానికి పుస్తకరూపమే ఇది. ఈ పుస్తకం అప్పటి భారత బ్రిటీష్‌ ఆర్థిక వ్యవస్థల బలోపేతానికి సహకరించింది. దీనిపై జరిగిన చర్చలు అనంతరకాలంలో రిజర్వ్‌బ్యాంక్‌ ఇండియా ఏర్పాటుకు బాటలేశాయి. రిజర్వ్‌బ్యాంక్‌ ఆవిర్భావానికి స్పష్టమైన లక్ష్యాలున్నాయి. కానీ ఇప్పుడు రిజర్వ్‌బ్యాంక్‌ ఖాతాదార్లకంటే ప్రభుత్వ ప్రతిష్టను పెంచేందుకే ఎక్కువ పని చేస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి 7.2శాతం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనాలేసింది. కాగా డిసెంబర్‌లో దీన్ని రిజర్వ్‌బ్యాంక్‌ ఏడుశాతానికి కుదించింది. అదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని 6.7శాతంగా రిజర్వ్‌బ్యాంక్‌ అంచనాకట్టింది. ఇందుకనుగుణంగా గతేడాది మే నుంచి డిసెంబర్‌ లోపు వడ్డీలను 1.90శాతం పెంచింది. అంతకుముందు 5.40శాతం వడ్డీ రేట్లకు జారీ చేసిన రుణాలపై 9శాతం వరకు వడ్డీ వసూలుకు బ్యాంకులకు పచ్చజెండా ఊపింది. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. గ్లోబల్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ విధానాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. దీంతో ఆర్థిక మార్కెట్లలో గందరగోళం నెలకొంది. ఇవన్నీ ఆశించిన స్థూల వృద్ధి సాధనకు ఆటంకా లుగా మారాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రిజర్వ్‌బ్యాంక్‌ అనూహ్యంగా వడ్డీల రేట్లను ఎలాంటి ముందస్తు హెచ్చరికలు, సమాచారం లేకుండా పెంచేసింది. ఆహారం, ఇంధనాల ధరల పెరుగుదల, అమెరికన్‌ డాలర్‌తో పోలిస్తే భారత్‌ రూపాయి మారకం ధర దిగజారడం, అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థల పతనం వంటి సంఘటనల్ని తన చర్యల్ని సమర్దించుకుంటూ రిజర్వ్‌బ్యాంక్‌ ప్రకటిం చింది. అయితే లక్ష్యాన్ని మించి సాగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఇప్పటికే ఆధిక భారాన్ని ఎదుర్కొంటున్న రుణగ్రహీతలపై రిజర్వ్‌బ్యాంక్‌ వడ్డీ పెంపు నిర్ణయం మరింత భారంగా పరిణమించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement