Tuesday, November 26, 2024

“రావణేశ్వరం”.. హస్తినకు దగ్గర్లోనే అసుర జన్మస్థానం.. రావణుడు ప్రతిష్ఠించిన శివలింగం

రామేశ్వరం అంటే అందరికీ తెలుసు.. సీతమ్మను రావణాసురుడు ఎత్తుకెళ్లగా ఆమె జాడ వెతుక్కుంటూ వెళ్లిన రాముడు సముద్రాన్ని దాటాలంటే వారధి నిర్మాంచాలని అనుకుంటాడు. అప్పుడు ఇసుకతో లింగాన్ని చేసి శివుడిని వేడుకుంటాడు. అని పురాణాల నుంచి కథలు ఉన్నాయి. అదే రామేశ్వరంగా ప్రసిద్ధి చెందింది.. కానీ, రావణేశ్వరం గురించి.. రావణుడు భక్తితో ప్రతిష్ఠించిన శివలింగం గురించి తెలుసా..

స్వరూప పొట్లపల్లి, ఆంధ్రప్రభ ఢిల్లీ బ్యూరో చీఫ్

రావణాసురుడు అనగానే ఎవరికైనా రామాయణంలో విలన్ అనే విషయమే గుర్తుకొస్తుంది. ఆయన పేరెత్తగానే సీతమ్మను ఎత్తుకెళ్లడం, అశోక వనంలో బందీ చేయడం, రామరావణ యుద్ధం, యుద్ధంలో రావణుడు నేలకొరగడం అనే విషయాలే మదిలో మెదులుతాయి. దసరా రోజైతే చాలా ప్రాంతాల్లో రావణాసురుడి భారీ దిష్టిబొమ్మలను తయారు చేసి దగ్దం చేస్తుంటారు. చెప్పులతో కొడుతుంటారు. అలాగే సకల విద్యా ప్రావీణ్యుడైన రావణుణ్ని భక్తితో ఆరాధించే ప్రాంతాలు కూడా ఉన్నాయని మనందరికీ తెలిసిందే. అయితే అవి ఏ శ్రీలంకలోనో, తమిళనాడులోనో కాదు. రాముడు పుట్టిన అయోధ్య ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోనే రావణాసురుణ్ని ఆరాధించే గ్రామం ఒకటుంది. అక్కడ రావణాసురుడు, ఆయన తండ్రి విశ్వశ్రవుడు ప్రతిష్టించినట్టుగా చెబుతున్న అరుదైన అష్టముఖి శివలింగం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఆ గ్రామం, అక్కడున్న స్వయంభూ శివలింగం విశేషాలు చదవి తెలుసుకుందాం…

- Advertisement -

న్యూఢిల్లీకి ముప్ఫై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ బుద్ధ నగర్ జిల్లా బిస్రఖ్ గ్రామం. గ్రేటర్ నోయిడాను ఆనుకుని ఉండే ఈ ప్రాంతంలో ఓవైపు ఆకాశ హార్య్మాలు, కాంక్రీట్ భవనాలు, మరోవైపు అసలుసిసలైన ఉత్తరాది పల్లె వాతావరణం సందర్శకులను పలకరిస్తూ ఉంటుంది. గ్రామ శివార్లలో ఉన్న పురాతన శివాలయానికి ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయి. ఇదంతా ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతమని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో చాలా చోట్ల మట్టి రోడ్లే కనిపిస్తాయి. ఆ ఆలయంలో ఉన్న శివాలయాన్ని రావణాసురుడు, ఆయన తండ్రి విశ్వశ్రవుడు ప్రతిష్ఠించారని స్థానికుల కథనం.

గుళ్లోకి అడుగు పెట్టగానే ప్రశాంత వాతావరణం, పచ్చని చెట్లు భక్తులకు ఆహ్వానంగా పలుకుతున్నట్టుగా ఉంటాయి. ఆలయానికి గతంలో ఉన్న పాత ద్వారాన్ని తీసివేసి కొత్త ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ద్వారానికి ఇరువైపులా విఘ్వేశ్వరుడు, అమ్మవారు, రావణుడి తండ్రి విశ్వశ్రవుడు, తల్లి కైకేశి విగ్రహాలు ఆకట్టుకుంటాయి. అక్కడే ఏర్పాటు చేసిన ఆరు పెద్ద గంటల ధ్వనులు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తుంటాయి. ప్రధాన ద్వారాన్ని దాటగానే శివుని త్రిశూలం, నంది కనిపిస్తాయి. వాటిని దాటుకుని గర్భాలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఎంతో కళగా కనిపించే అష్టముఖి శివలింగాన్ని దర్శించుకుంటే సకల శుభాలూ కలుగుతాయని, కోరిన కోరికలు నెరవేరతాయని చెబుతుంటారు. బోళాశంకరుడు అభిషేకప్రియుడు. భక్తులు శివయ్యకు అభిషేకం చేయడానికి శివలింగానికి సమీపంలో ఆలయంలోనే పంపును ఏర్పాటు చేశారు.

గుళ్లో మూడు లింగాలు

స్వామి వారి దర్శనం తర్వాత గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న గుహను చూడవచ్చు. ఆలయం అడుగు భాగంలో గుహ వంటిది కనిపిస్తుంటుంది. సాధు సంతువులు ఆ గుహలో కూర్చుని ధ్యానం చేసుకుంటారు. గుహలా కనిపిస్తున్న ఆ సొరంగ మార్గం గుండా వెళ్తే ఘజియాబాద్‌లోని దూధేశ్వరాలయానికి చేరుకుంటారని శివాలయ ఆలనా పాలనా చూస్తున్న సునీల్ కుమార్ తివారీ చెప్పుకొచ్చారు. రావణుడు ప్రతిష్టించిన శివాలయ ప్రాంగణంలోనే మరో ఆధునిక శివలింగాన్ని, చిన్న గుడినీ ఏర్పాటు చేశారు. దానికి సమీపంలోనే నవగ్రహాలూ ఉన్నాయి. వాటికీ భక్తులు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. దానిని ఆనుకుని ఉన్న విశాలమైన ప్రాంగణంలో దశకంఠుడి తండ్రి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమైనట్టుగా విగ్రహాలున్నాయి. అక్కడ మూడో శివలింగాన్నీ చూడవచ్చు. ఆ తర్వాత విభిన్న ఆకారంలో కుర్చున్న శివపార్వతుల విగ్రహాలున్నాయి. ఇలాంటి శివపార్వతుల విగ్రహాలు దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి స్వస్థలంలో తప్ప మరెక్కడా లేవని సునీల్ కుమార్ తివారీ వెల్లడించారు. మోహన్, శ్రీమహాలక్ష్మి సమేత విష్ణుమూర్తి, కల్కి, అమ్మవారు, రావణుడి అన్న కుబేరుడు, రాధాకృష్ణులు, ఆంజనేయుడి విగ్రహాలను ఆ ప్రాంగణంలో చూడవచ్చు. ఆలయాన్ని అనుకుని పూజారులు, సాధువులు, గుడి సిబ్బంది ఉండడానికి వసతి సదుపాయం కూడా ఉంది.

రావణుడి తండ్రి పేరుతో ఏర్పడ్డ ఊరు

సకల శాస్త్రాలూ ఔపోసన పట్టిన పులస్త్య బ్రహ్మ మనవడైన విశ్వశ్రవుడు విశ్వశ్రవ ధామాన్ని నెలకొల్పాడని, కాలక్రమేణా ఆయన పేరు మీదే బిస్రఖ్ గ్రామం రూపుదిద్దుకుందని స్థానికుల విశ్వాసం. గుడి ప్రాంగంణంలో పెద్ద పెద్ద ప్రాచీన మర్రి, రావి, వేప, ఇతర వృక్షాలున్నాయి. మర్రిచెట్టు కింద ఏర్పాటు చేసిన రచ్చబండ పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంటుంది. పచ్చదనం, ప్రశాంతత, పరిశుభ్రత, ఆధ్యాత్మికతకు ఈ ప్రాంతం మారుపేరులా కనిపిస్తుంటుంది.

విగ్రహమే లేని ఆరాధన

విశ్వశ్రవుడు, కైకేశి, కుబేరుడి బొమ్మలు ఆలయ ప్రాంగణంలో కనిపించాయే గానీ ఎక్కడా రావణాసురుడి విగ్రహం గానీ, ఆయన ప్రస్తావన కానీ కనిపించలేదు. ఆయన ప్రతిష్టించిన శివలింగానికి అక్కడ నిత్యం పూజలు జరుగుతుంటాయి. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ స్థాయిలో రావణుడి విగ్రహాన్ని దహనం చేస్తుంటే… అక్కడికి సమీపంలోనే ఉన్న బిస్రఖ్ గ్రామంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుంటుంది. ఆరోజు స్థానికులు రావణబ్రహ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేస్తారు. దసరా, దీపావళి, కార్తీక మాసం, ఇతర పండుగలు-పర్వదినాల్లో శివుడికి ఇక్కడ విశేష పూజలు జరుగుతుంటాయి.

బిస్రఖ్ రావణ జన్మభూమి అన్నది నిజమేనా?

విశ్వశ్రవ ధామం ఈ ప్రాంతంలో ఉండేదని నమ్ముతున్న స్థానికులు ఇదే లంకాధిపతి రావణ జన్మస్థలమనీ విశ్వసిస్తుంటారు. ఇంటర్నెట్‌లో కూడా బిస్రఖ్ అనగానే రావణ జన్మభూమి అని కనిపిస్తుంటుంది. అయితే అందుకు సంబంధించిన చారిత్రక, పురాణేతిహాస ఆధారాలేవీ లేవు. ఈ లెక్కన బిస్రఖ్ రావణ జన్మభూమి అనేది ఓ నమ్మకం తప్ప నిజమో, కాదో ఎవరికీ స్పష్టత లేదు. రావణ రాజ్యమంతా శ్రీలంకలో కదా అంటే… ఇక్కణ్నుంచి వెళ్లి అక్కడ రాజ్యాన్ని విస్తరించారని స్థానికులు చెబుతున్నారు. శివాలయం చుట్టూ పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. రియల్ బూమ్‌ను మరింత పెంచేందుకు కొందరు అలాంటి ప్రచారం చేస్తున్నారనే వాదనలూ వినిపిస్తున్నాయి.

గోమాతపై ఆశీనులై ఉండే శైలపుత్రి

ఈ శివాలయం ఉత్తరప్రదేశ్ దేవాదాయ శాఖ పరిధిలో ఉంటుంది. దానిని ఆనుకుని శైలపుత్రి అమ్మవారి ఆలయ నిర్మాణం జరుగుతోంది. అమ్మవారు గోమాతపై ఆశీనులై భక్తులకు దర్శనమిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, బ్రహ్మదేవుడు, శివుడి విగ్రహాలనూ దర్శించుకోవచ్చు.

రావణగుడికి చేరుకునేదెలా? ఢిల్లీ నడిబొడ్డు నుంచి గంటసేపు ప్రయాణం చేస్తే ఈ శివాలయానికి చేరుకోవచ్చు. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా వెళ్తే త్వరగా చేరుకోవచ్చు. మెట్రో ద్వారా వెళ్లేవారు గ్రేటర్ నోయిడా చేరుకుని అక్కణ్ణుంచి ఆటో, ట్యాక్సీల్లో బిస్రఖ్ చేరుకోవచ్చు. ఢిల్లీ, చుట్టుపక్కల సందర్శనీయ ప్రాంతాలను చూడడానికి వచ్చే వారు ఈ శివాలయాన్ని కూడా సందర్శించవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement