Friday, November 22, 2024

మంచిర్యాలలో అరుదైన పక్షి జాతి.. బ్యూటిఫుల్​ ఈగల్ అంటున్న ఔత్సాహికులు

అత్యంత అరుదైన జాతికి చెందిన పక్షి ఒకటి మంచిర్యాల జిల్లాలో కనిపించింది. దీన్ని వన్యప్రాణుల ఔత్సాహికుడు అబ్దుల్​ రహీం తొలిసారి ఫొటో తీశాడు. ఈ పక్షి జాతి తెలంగాణలో కనిపించడంపై ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​తోపాటు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అధికారులు, వన్యప్రాణుల ఔత్సాహికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 16వ తేదీన మంచిర్యాల పట్టణానికి సమీపంలోని MCC కి సమీపంలోని పాడుబడిన క్వారీ దగ్గరున్న దేవాలయం ఆవరణలో ఈ అరుదైన పక్షి రూఫస్-బెల్లీడ్ డేగ కనిపించింది. అనుకోకుండా మంచిర్యాల జిల్లాలో ఇది మొదటిసారిగా రికార్డ్ అయ్యింది.

కరీంనగర్‌కు చెందిన సాఫ్ట్ వేర్ నిపుణుడు, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ (హెచ్‌బీపీ) సభ్యుడు అయిన అబ్దుల్ రహీం దీని ఫొటో తీశారు. క్వారీలో పక్షులు వేట సాగిస్తుండగా ఈ పక్షి పిల్లను తాను గుర్తించినట్లు తెలిపాడు. పక్షుల సమాచారాన్ని సేకరించే ప్రత్యేక వెబ్‌సైట్ ebird.org లో తెలిపిన ప్రకారం ఇది తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నాలుగుసార్లు కనిపించినట్టు ఆయన పేర్కొన్నారు. ఇక.. మందమర్రి మండలం బొక్కలగుట్ట శివారులోని గాడ్‌పూర్‌, నాగారం, కోలంగూడ, హాజీపూర్‌ మండలం గాంధారి కోటతోపాటు పలు అటవీ గ్రామాల సమీపంలోని అడవుల్లో అబ్దుల్​ పక్షుల ఫొటోలు తీశానని చెప్పారు. తెలంగాణలో నివశించే మొత్తం 12 గుడ్లగూబలతో సహా వివిధ పక్షి జాతులను తాను ఫొటో తీశానన్నారు. అతను 2021లో నిజామాబాద్‌లోని సిర్నాపల్లిలో కింగ్‌ఫిషర్ చిత్రాన్ని ఫొటో తీయడం సంచలనంగా మారింది.

కాగా, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పట్ల ఆకర్షితుడై 2019లో బర్డింగ్‌లోకి ప్రవేశించినట్లు అబ్దుల్​ వెల్లడించాడు. అతను ఇప్పటివరకు అనేక అడవులు , పక్షులు నివాసముండే ప్రాంతాలను అన్వేషించాడు. 2019లో కుమ్రం భీమ్ ఆసిఫాబాద్‌లో అటవీ శాఖ నిర్వహించిన బర్డ్ వాక్‌లో పాల్గొని వివిధ పక్షుల ఫొటోలను తీసినట్టు గుర్తు చేసుకున్నాడు. indianbirds.thedynamicnature.com ప్రకారం పక్షి జాతులు భారతదేశం, నేపాల్, భూటాన్, శ్రీలంక, ఇండోచైనా, ఆగ్నేయాసియా, ఇండోనేషియా మరియు ఫిలిప్పీన్స్‌ లో ఎక్కువగా ఉన్నాయి. ఇక.. తెలంగాణ రాష్ట్రంలో కవాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)కి ఈ అరుదైన జాతి పక్షిని స్వాగతం పలుకుతున్నట్టు మంచిర్యాల జిల్లా అటవీ అధికారి ఆశీష్ సింగ్ అన్నారు. అంతకుముందు కూడా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో తొలిసారిగా ఈ పక్షి కనిపించిందని తెలిపారు. 2020లో తొలిసారిగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలం నందిగావ్ శివారులోని పాలరాపు కొండపై ఈ అందమైన డేగ కనిపించినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement