మార్నింగ్ లేవగానే ఒక వేడి వేడి చాయ్ గొంతులోకి వెళ్లనిదే ఆ రోజు మొదలు కాదు. అట్లా రోజంతా బీజీ బిజీగా ఉన్నా.. ఎన్నోసార్లు హాట్ హాట్ టీని ఆస్వాదిస్తూ రీఫ్రెష్ అవుతుంటారు చాలామంది. అట్లాంటిది అస్సాం టీ అంటే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ, ఈ టీ ముచ్చట వింటే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే వంద గ్రాముల టీ పొడి దాదాపు 100 రూపాయల నుంచి మొదలువుతుంది. ఈ లెక్కన కిలో టీపొడి దాదాపు 1000 రూపాయలు ఉండొచ్చు. కానీ, ఈ టీ ఆకులు మాత్రం కిలో లక్ష రూపాయలకు అమ్ముడు పోయాయి. అదే దీని స్పెషాలిటీ అంటున్నారు టీ ఎస్టేట్ నిర్వాహకులు.
అది అస్సాంలోని పభోజన్ ఆర్గానిక్ టీ ఎస్టేట్.. దాని యజమాని రాఖీ దత్తా సైకియా ఈ ఏడాది ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ సారి తన టీ ఎస్టేట్ నుంచి భారీ బేరమే తగిలింది. వారి అరుదైన రకానికి చెందిన టీ ఆకులకు కిలోకి ఏకంగా లక్ష రూపాయల ధర పలకడమే దీనికి కారణం. “మేము ఈ అరుదైన రకం టీని కేవలం ఒక కేజీ మాత్రమే ఉత్పత్తి చేశాం. చరిత్ర సృష్టించిన ఈ కొత్త రికార్డ్ బ్రేకింగ్ ధర పట్ల సంతోషంగా ఉన్నాం. అయితే ఈ రేటు అస్సాం టీ పరిశ్రమ కోల్పోతున్న కీర్తిని మళ్లీ నిలబెడుతుందన్న నమ్మకం ఉంది..” అని టీ ఎస్టేట్ నిర్వాహకురాలు రాఖీ దత్తా అన్నారు.
అస్సాంలోని గోలాఘాట్ జిల్లాకు చెందిన పభోజన్ గోల్డ్ టీ అనే అరుదైన రకం ఆర్గానిక్ టీ ఇవ్వాల (సోమవారం) జోర్హాట్‌లోని వేలం కేంద్రం ద్వారా కిలోగ్రాముకు 1 లక్ష రూపాయలకు విక్రయించబడింది. ఈ ఏడాది ఇదే అత్యధిక రేటు అని అక్కడి అధికారులు అంటున్నారు. పభోజన్ ఆర్గానిక్ టీ ఎస్టేట్ విక్రయించిన టీని అస్సాంకు చెందిన టీ బ్రాండ్ అయిన ఈసా టీ కొనుగోలు చేసిందని జోర్హాట్ టీ వేలం కేంద్రం (JTAC) అధికారి తెలిపారు.
పభోజన్ గోల్డ్ టీ ఒక ప్రకాశవంతమైన పసుపు వర్ణాన్ని కలిగి ఉంటుంది. ఈ టీ ఎస్టేట్ నుండి తీసిన సెకండ్ ఫ్లష్ చిట్కాల(ఆకుల) నుండి తయారు చేశారు. ఈ చిట్కాలు బంగారు రంగులోకి మారుతాయి. పానీయానికి మంచి రంగును వచ్చేలా చేస్తాయి . తమ వినియోగదారులకు అస్సాం నుండి అత్యుత్తమ టీ మిశ్రమాలను అందించడానికి ఈ వెరైటీ టీ రకం వారికి సహాయపడుతుందని ఈసాహ్ టీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బిజిత్ శర్మ అన్నారు.
ఈ టీ రకం చాలా అరుదుగా దొరుకుతుంది. టీ వ్యసనపరులకు ఇది ఒక కప్పులో ఎంతో మంచి అనుభవాన్ని ఇస్తుంది. మా కస్టమర్‌లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. ఈ రకం రుచి, విలువను అర్థం చేసుకుంటారు. వారికి అసలైన అస్సాం టీ రుచులను అందించాలనే మా మిషన్‌ను కొనసాగిస్తున్నాం. అందుకు మేము సంతోషిస్తున్నాం” అని ఆయన అన్నారు.