తుపాకీ కాల్పుల్లో ప్రముఖ ర్యాపర్ 36ఏళ్ల డాల్ఫ్ దుర్మరణం చెందాడు. అమెరికాలోని మెంఫిస్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కుకీ షాప్ లో కాల్పులు జరిగాయి. కాగా డాల్ఫ్ తన సొంత పట్టణం మెంఫిస్ కి చేరుకున్నాడు. ఆయన బంధువుల్లోని ఒకరికి క్యాన్సర్ సోకడంతో ఆమెను పరామర్శించడానికి మెంఫిస్ పట్టణానికి వచ్చాడు అని ఆయన సోదరి మరేనో మైర్స్ తెలిపింది. ఆయన కుకీ షాప్‌లోపల ఉండగానే ఓ దుండగుడు షాప్‌లోకి వెళ్లి ర్యాపర్ యంగ్ డాల్ఫ్‌ను చంపేసినట్టు వెల్లడించింది. ఈ ఘటన అనంతరం మెంఫిస్ పోలీసు డైరెక్టర్ డేవిస్ విలేకరులతో మాట్లాడారు. ప్రజలు సంయమనం పాటించాలని, ఎవరూ ఇంటి నుంచి బయట అడుగు పెట్టవద్దని సూచనలు చేశారు. అవసరమైతే పరిస్థితులను బట్టి కర్ఫ్యూ విధించడానికి వెనుకాడబోమని వివరించారు. కాగా, కాల్పులకు పాల్పడిన వ్యక్తికి సంబంధించి తమ దగ్గర ఎలాంటి సమాచారమూ లేదని పోలీసులు ఓ ట్వీట్లో పేర్కొన్నారు.
చికాగోలో జన్మించిన యంగ్ డాల్ఫ్ అసలు పేరు అడాల్ఫ్ థోర్న్టన్. 2008 నుంచి ర్యాపర్‌గా కెరీర్ ప్రారంభించాడు. అనతి కాలంలోనే విశేష ఆదరణ సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా హిప్ హాప్ కమ్యూనిటీలో ఆయనకు మంచి పేరుంది. పేపర్ రూట్ క్యాంపెయిన్, కింగ్ ఆఫ్ మెంఫిస్, రిచ్ స్లేవ్ వంటి ఆల్బమ్స్ ప్రజాదరణ పొందాయి. ఇందులో గతేడాది ఆయన రూపొందించిన రిచ్ స్లేవ్ ఆల్బమ్ బిల్‌బోర్డు 200లో నెంబర్ 4 ర్యాంక్ సంపాదించుకుంది. బిల్‌బోర్డు 200లో టాప్ టెన్ ర్యాంకుల్లో యంగ్ డాల్ఫ్ ఆల్బమ్‌లు మూడు ఉన్నాయి. యంగ్ డాల్ఫ్ తన మ్యూజిక్‌లో డ్రగ్ డీలర్ లైఫ్‌ను చిత్రించారు. అంతేకాదు, మెంఫిస్ పట్టణంలో వీధుల్లో గడిపే జీవితాల పైనా మ్యూజిక్ చేశాడు. ఇటీవలే ఆయన యూనివర్సిటీ ఆఫ్ మెంఫిస్‌లో ఓ కాన్సర్ట్ ప్రదర్శన ఇచ్చారు. ఇంతలోనే ఇలా దుర్మరణం చెందారు. ఆయన అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..