కర్నాటక రాష్ట్రం దావణగెరెలో ఓ వ్యక్తి 40 అడుగుల ఎత్తున్న గోడ మీది నుంచి దూకి జైలు నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన జైలు ప్రాంగణంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. దీంతో జైలు అధికారులు, పోలీసులు కలిసి సెర్చ్ ఆపరేషన్ స్టార్ చేశారు. కాగా, నిందితుడిని 23 ఏళ్ల వసంత్‌గా గుర్తించారు.
ఓ యువతిని బలత్కారం చేసిన కేసులో మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అత్యాచారం ఆరోపణలపై 23 ఏళ్ల వసంత్‌ని అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం జైలుకు తరలించారు. కాగా, ఆగస్టు 25వ తేదీన 40 అడుగుల ఎత్తున్న సబ్ జైలు గోడపైనుంచి వసంత్ దూకేశాడు. సాహసోపేతంగా తప్పించుకునే సమయంలో అతని కుడి కాలికి తీవ్ర గాయమైంది.
కానీ, ఎక్కడా ఆగకుండా పారిపోయాడు. దీంతో జైలు అధికారులు, స్థానిక పోలీసులు వెతికే పనిలో పడ్డారు. పరారీలో ఉన్న వసంత్‌ను గుర్తించి పట్టుకోవడానికి జైలు, పోలీసు అధికారులు సమన్వయంతో సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడిని సమీపంలోని హవేరీ జిల్లాలో ట్రాక్ చేసి, 24 గంటల్లో మళ్లీ అరెస్టు చేశారు.