పుదుచ్చేరి కేబినెట్‌లో దాదాపు 40 ఏళ్ల తర్వాత తొలిసారి ఒక మహిళకు స్థానం లభించింది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఎన్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా ఎన్నార్ రంగస్వామి గత నెల 7న ప్రమాణస్వీకారం చేశారు. వివిధ కారణాలతో మంత్రివర్గం ఏర్పాటు ఆలస్యమైంది. ఎట్టకేలకు 52 రోజుల తర్వాత తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఐదుగురితో మంత్రివర్గం ఏర్పాటు చేశారు. వారిలో ఓ మహిళ కూడా ఉన్నారు. పుదుచ్చేరి మంత్రివర్గంలో ఓ మహిళకు స్థానం దక్కడం 40 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం. ఎన్నార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చంద్ర ప్రియాంక ఈ అవకాశం దక్కించుకున్నారు. ఆదివారం పుదుచ్చేరిలోని రాజ్ భవన్‌లో మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వారి చేత ప్రమాణస్వీకారం చేయించారు.
ఇటీవల పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా ఎన్నార్ కాంగ్రెస్, అన్నాడీఎంకే, బీజేపీ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, 1980-1983 మధ్య కాంగ్రెస్–డీఎంకే కూటమి క్యాబినెట్‌లో డీఎంకేకు చెందిన మహిళా నాయకురాలు రేణుక అప్పాదురై మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత పుదుచ్చేరి క్యాబినెట్‌లో మహిళలకు మంత్రి పదవి దక్కలేదు. తాజాగా రంగస్వామి కేబినెట్‌లో మహిళకు చోటుదక్కింది.
ఇదీ చదవండి: హుజురాబాద్లో గులాబీ ట్రబుల్ షూటర్.. ఆ ఫార్ములా పని చేస్తుందా?