Tuesday, November 19, 2024

భద్రాద్రిలో రాములోరి తెప్పోత్సవం.. కొవిడ్ రూల్స్ మేర‌కు ప్రత్యేక పూజలు

భద్రాచలం, (ప్రభన్యూస్‌) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి తెప్పోత్సవం బుధవారం కొద్ది మంది భక్తుల నడుమ కోవిడ్‌ దృష్ట్యా నిరాడంబరంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక పుష్కరిణి (హంసవాహనం)లో స్వామి తెప్పోత్సవాన్ని నిర్వహించడం విశేషం. గత మూడేళ్ళుగా కరోనా ప్రభావం వలన ఆలయ ప్రాంగణంలోనే స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు. కాగా తెప్పోత్సవానికి విచ్చేసిన భక్తుల రామనామస్మరణతో, జగమేలే స్వామి జగదభి రాముడు సీతా, లక్ష్మణ సమేతుడై బుధవారం సాయంత్రం పుష్కరిణిలో దర్శనమిచ్చి కనువిందు చేశారు. ఈ సుందరమైన దృశ్యాన్ని వీక్షించిన భక్తజనం భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వామి తెప్పోత్సవం జరగడం పట్ల పలువురు నిరాశ చెందారు. ఉత్సవాలలో భాగంగా స్వామి వారికి మధ్యాహ్నం గం.3.00లకు ఆలయంలో ధర్భార్‌ సేవ నిర్వహించారు. సాయంత్రం గం.5.00 లకు స్వామి వారు రామాలయం నుంచి పల్లకీలో పుష్కరిణి వద్దకు తరలి వచ్చారు.

కొద్ది మంది భక్తులతో ఆలయ ప్రాంగణం గత సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలతో పోలిస్తే వెల వెలబోయిందని భక్తులు చర్చించుకోవడం కనబడిం ది. కోవిడ్‌ నేపథ్యంలో బుధవారం సాయంత్రం గం.6.00లకు ప్రారంభమైన స్వామి వారి తెప్పోత్సవం హంసవాహనంపై నిలకడగా ఉంది. విహార యాత్ర జరపలేదు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లు, భద్రాచలం ఏఎస్పీ అక్షాన్స్‌ యాదవ్‌, సీఐ టి.స్వామి, తహశీల్దార్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, దేవస్థానం ఈవో బి.శివాజీ, ఏఇవో శ్రావణ్‌ కుమార్‌, సిసి అనిల్‌, సూపరిండెంట్‌లు కత్తి శ్రీను, సాయిబాబు, ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజా చార్యులు, విజయ రాఘవన్‌, అధర్వణ వేదపండితులు గుదిమెల్ల మురళీకృష్ణమాచార్యులు, సన్యాసి శర్మ, స్థానాచార్యులు స్థలసాయి, విశ్రాంత అర్చకులు సీతారామాచార్యులు, అర్చకులు మురళికృష్ణమాచార్యులు, గోపాలాచార్యులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌, జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ల ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో పాల్గొనేందుకు పలువురు విఐపిలు వచ్చే అవకాశం ఉంది. పట్టణాన్ని పోలీసు బలగాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

ముక్కోటికి భద్రాద్రి సర్వం సిద్ధం..
వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా గురువారం తెల్లవారు జామున జరిగే వైకుంఠ ఉత్తర ద్వారదర్శనానికి భద్రాద్రి సర్వం సిద్దమైంది. గురువారం తెల్లవారు జామున గం.5.00లకు జరిగే ఉత్తర ద్వారదర్శనం ద్వారా స్వామి వారిని దర్శించుకునేందుకు కొద్ది మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంది. కొందరు విఐపిలు సైతం కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. పట్టణం అంతా సర్వాంగ సుందరంగా తయారైంది. ముక్కోటిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌, జిల్లాఎస్పీ సునీల్‌దత్‌, భద్రాచలం ఏఎస్పీ అక్షాన్స్‌ యాదవ్‌ల ఆధ్వర్యంలో భారీ పోలీస్‌ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement