Monday, November 18, 2024

వ్యాక్సిన్లతో ప్రయోజనం లేదు… ఆయుర్వేదమే రక్ష: యోగా గురు

అల్లోపతి వైద్యంపై ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాందేవ్ బాబా వ్యాఖ్యలతో ఆయుర్వేద వైద్య విధానం వర్సెస్ అల్లోపతి వైద్యం అన్నట్లుగా సాగుతోంది. వ్యాక్సిన్‌ల సమర్థత, అల్లోపతి ప్రభావంపై  తన దాడిని మరింత తీవ్రం  చేశారు.  తద్వారా అల్లోపతి, ఆయుర్వేదం మధ్య రగిలిన వివాదానికి మరింత ఆజ్యం పోశారు. తాజాగా  కరోనా వ్యాక్సిన్‌ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు.  తాను టీకా తీసుకోలేదని,  సుదీర్ఘం కాలంగా సాధన చేస్తున్న యోగా, ఆయుర్వేదమే తనకు రక్ష అని పేర్కొన్నారు. పురాతన భారతీయ వైద్య విధానం ఆయుర్వేదానికి వ్యతిరేకంగా ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోందని ఆయన ఆరోపించారు. దశాబ్దాలుగా యోగా, ఆయుర్వేదం అభ్యసిస్తున్నానని తెలిపారు. అందుకే తనకు టీకా అవసరం లేదని చెప్పారు. రానున్న కాలంలో ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించనుందని రాందేవ్ ధీమా వ్యక్తం చేశారు.

కాగా, ఇటీవల బాబా రాందేవ్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో పాటు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే రామ్ దేవ్ బాబా క్షమాపణలు చెప్పి.. ఆ వివాదానికి తెరదించారు. అయితే రామ్ దేవ్ బాబా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నోటీసులతో క్షమాపణలు చెప్పినా.. ఆ వెంటనే ఆయన ఐఎంఏకు 25 ప్రశ్నలు సంధించి గట్టి కౌంటరే ఇచ్చారు.

అల్లోపతి వైద్యవిధానంపై రాందేవ్ బాబా అనుచిత వ్యాఖ్యలుతో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఆగ్రహానికి గురయ్యారు. కరోనా కట్టడిలో ఆధునిక వైద్యం విఫలమైందని, “స్టుపిడ్ సైన్స్” అదో పనికిమాలిందంటూ రాందేవ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా చికిత్సకు అల్లోపతి విధానం పనికిరాదని అంటున్నారని, దేశం సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ స్వ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టింది. అల్లోపతి మందుల సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ ఆయన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేసింది.

ఇది కూడా చదవండి: కరోనాతో రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి.. ఆనందయ్య మందుపై సందేహాలు!

Advertisement

తాజా వార్తలు

Advertisement