– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
ఢిల్లీ ప్రభుత్వంలో బ్యూరోక్రాట్‌ల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించిన నిర్ణయాలు ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీంకోర్టు మే 11వ తేదీన తీర్పునిచ్చింది. అయితే.. దీన్ని పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఆ బదిలీలు.. పోస్టింగ్‌లను తమ చెప్పుచేతల్లోకి తీసుకోవడానికి కొత్త చట్టబద్ధమైన అథారిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేసేలా మే 19వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ ను విడుదల చేసింది. దీంతో మళ్లీ కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ జనరల్, ఢిల్లీ ప్రభుత్వం మధ్య సమస్య మొదటికొచ్చింది.
కేజ్రీవాల్ సమావేశాల జోరు..
కేంద్రం ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ప్రతిపక్ష నేతలందరినీ కలుస్తానని మే 21వ తేదీన కేజ్రీవాల్ ప్రకటించారు. ఆయన ఇప్పటికే బిహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ వంటి కొంతమంది నేతలను కలిశారు. కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా కలిశారు. కేజ్రీవాల్ వెంట ఆప్ నేతలు రాఘవ్ చద్దా, అతిషి సింగ్ ఉన్నారు.
కాగా, కొన్ని రోజుల క్రితం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి పార్టీ అధ్యక్షుడిని కలవాలని, రాజ్యసభలో ప్రతిపాదిత బిల్లును ఓడించడానికి వారి మద్దతు కోరాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ విషయంలో ఇతర ప్రతిపక్ష నేతలతో కూడా మాట్లాడాలని నితీష్ కుమార్‌ను కోరినట్టు తెలిపారు. ఆప్ కన్వీనర్ మే 24, 25 తేదీల్లో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో కూడా భేటీ కానున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్, ఆప్ తికమక..
ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆప్‌కి మద్దతివ్వవచ్చని అనుకున్నప్పటికీ, రెండు పార్టీల గత చరిత్రను గమనంలోకి తీసుకుంటే కాస్త క్లిష్టతరం కానుంది. పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అరవింద్ కేజ్రీవాల్ కన్వీనర్‌గా ఉన్న AAP, కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష పోటీదారులుగా ఉన్నాయి. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ.. కాంగ్రెస్ నుండి అధికారాన్ని చేజిక్కించుకుంది. గోవా, గుజరాత్, కర్నాటక వంటి రాష్ట్రాల్లోనూ ఆప్ మళ్లీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రాజకీయం నడుపుతోంది. ముఖ్యంగా కర్నాటకలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత ప్రమాణ స్వీకారోత్సవానికి అరవింద్ కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ ఆహ్వానం పంపలేదు.
ఇక.. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఇతర ప్రతిపక్ష నాయకులను కలుసుకున్నప్పుడు కాంగ్రెస్‌కు దూరంగా ఉన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఆమ్ ఆద్మీ పార్టీ రూపుదిద్దుకుంది. దేశ రాజధానిలో కాంగ్రెస్ పార్టీని ఆయన విజయవంతంగా ఎదురించారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మధ్య మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పునకు కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని, బిల్లును వ్యతిరేకించడంలో భావసారూప్యత ఉన్నవారితో చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే అరవింద్ కేజ్రీవాల్‌కు తమ మద్దతు ఉంటుందా? లేదా అన్న విషయం స్పష్టంగా తెలియదని చెప్పారు.
కేజ్రీవాల్ విజయం సాధిస్తారా?
అరవింద్ కేజ్రీవాల్‌కు అన్ని ప్రతిపక్ష పార్టీల మద్దతు లభించినా విజయం సాధిస్తారా? లేదా? అనేది ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న. ప్రతి జాతీయ పార్టీకి ఉన్న ఎంపీలతో కేజ్రీవాల్ సపోర్ట్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో వారు మద్దతు ఇస్తే ఏం జరుగుతుందో ఈ దిగువని పార్టీల వారీగా ఉన్న డిటెయిల్స్‌ని పరిశీలిస్తే ఓ పిక్చర్ క్లారిటీ వస్తుంది.
ఇక.. కేజ్రీవాల్‌కు జేడీ(యు), ఆర్జేడీ, టీఎంసీ, ఎన్‌సీపీ, శివసేన (యుబిటి), సీపీఐ(ఎం), సీపీఐ, డీఎంకే వంటి పార్టీల మద్దతు లభించినప్పటికీ.. ఆయనకు అనుకూలంగా దాదాపు 70 మంది ఎంపీలు (ఆప్‌లోని 10 మందితో సహా) అంటే 31 మంది ఎంపీలను రాజ్యసభకు పంపే కాంగ్రెస్ పైనే ఆధారపడాల్సి వస్తుంది. అయితే.. ఎగువ సభలో బీజేపీకి 93 స్థానాలు గణనీయంగా ఉన్నాయి. కాగా, YSRCP, BJD వంటి కొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతు ఉంటే కనుక NDA ప్రభుత్వాన్ని ఓడించడం AAPకి పెద్ద కష్టం కాకపోవచ్చని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు.
ఇక.. ఇది 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బలా బలాలను పరీక్షించడానికి చాలా ప్రతిష్టాత్మకమైన ప్రక్రియగా చెప్పుకోవచ్చు. దీనికి గాను అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఓ గొప్ప ప్రయత్నంగా కూడా అనుకోవచ్చు. అతను తన ఆలోచనలకు తగ్గ భావసారూప్య ప్రతిపక్ష పార్టీలన్నింటినీ సమీకరించగలిగితే.. ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు కేంద్ర బిందువు అవుతాడని నిరూపించినట్టు అవుతుంది. ఇట్లాంటి తరుణంలో ప్రతిపక్ష శ్రేణుల్లోని చాలా మంది ప్రధాని పదవి ఆశించే లీడర్లకు ఆమోదయోగ్యంగా ఉంటుందో లేదో చూడాలి.