Saturday, November 23, 2024

Ramappa Temple: ‘ప్రసాద్’ పథకంలోకి రామప్ప ఆలయం

కాకతీయుల శిల్ప కళా వైభవానికి ప్రతీక రామప్ప ఆలయం. యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత.. ప్రసిద్ధ రామప్ప ఆలయ అభివృద్ధిపై కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఇందులో భాగంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ తీర్థయాత్రల పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకం(ప్రసాద్‌)లో చేర్చింది. దీనికి ఆ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆమోదం తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో లేఖ పంపనున్నట్లు సమాచారం. ఆలయం వెలుపల అభివృద్ధి పనులు, మౌలిక వసతులకు సంబంధించి.. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) పంపాలని కేంద్ర పర్యాటకశాఖ రాష్ట్రాన్ని కోరనుంది. ఈ పనుల్ని రెండేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మరోవైపు ఆలయలో సౌకర్యాలు మెరుగుపరచడం కోసం రూ.40-50 కోట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం కేంద్ర పురావస్తుశాఖ ఆధీనంలో ఉంది. జులైలో దీనికి యునెస్కో గుర్తింపు లభించింది. దీనివల్ల విదేశీ టూరిస్టులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. కాగా, భద్రాచలం ఆలయాన్ని కూడా ప్రసాద్‌ పథకంలో చేర్చిన విషయం తెలిసిందే. రామాయణ సర్క్యూట్‌ కింద ఆ ఆలయాన్ని చేర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement