ఖమ్మం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనపై టిఆర్ ఎస్ నాయకత్వం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.ఆత్మహత్యకి ముందు సెల్ఫీ వీడియోలో తనతో పాటు తన కుటుంబం ఆత్మ హత్య చేసుకోవడానికి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు తనయుడు వనమా రాఘవేందర్ కారణమని రామకృష్ణ తెలిపాడు. ఈ వీడియో నేడు మీడియాలో ప్రసారం అయింది. దాంతో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఇంటిని బీజేపీ నేతలు ముట్టడించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే పదవికి వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. వనమా రాఘవేందర్ రావు ఎంత దారుణంగా తనను వేధింపులకు గురి చేశాడో రామకృష్ణ ఆత్మహత్యకు ముందు సెల్పీ వీడియోలో ప్రస్తావించాడు. తన భార్యను తీసుకొని హైదరాబాద్ కి రావాలని వనమా రాఘవేందర్ ఆర్ఢర్ వేశాడని ,రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులైతే ఇవ్వగలను కానీ, భార్యను ఎలా పంపగలనని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సెల్పీ వీడియో బయటకు రావడంతో విపక్షాలు వనమా రాఘవను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ నెల 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తొలుత గ్యాస్ లీకై ప్రమాదవశాత్తు రామకృష్ణ కుటుంబం చనిపోయిందని భావించారు. అయితే మృతులున్న గదిలో సూసైడ్ నోట్ లభ్యం కావడంతో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్య చేసకోబోయే ముందు రామకృష్ణ తీసుకొన్న సెల్ఫీ వీడియో మీడియాలో ప్రసారమైంది. కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్ర అరాచకాలకు అడ్డూ లేకుండా పోయిందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. రాఘవేంద్ర వేధింపులతో పలు కుటుంబాలు ఇబ్బంది పడిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే రాఘవేందర్ ను కఠినంగా శిక్షించకుండా వదిలేయడంతోనే పదే పదే ఇదే తరహా ఘటనలు చోటు చేసకొంటున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. వనమా రాఘవేందర్ రావును పార్టీ నుండి సస్పెండ్ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. నేటి సాయంత్రానికి ఈ విషయమై గులాబీ పార్టీ నాయకత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital
.