తెలంగాణలో సంచలనం రేపిన పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు చేసుకుంది. ఈ కేసులో మృతుడు రామకృష్ణ తల్లి సూర్యావతి, సోదరి మాధవిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఇద్దరినీ ఖమ్మం సబ్ జైలుకి తరలించారు. ఈ కేసులో ఇప్పటికే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్ర రిమాండ్ లో ఉన్నారు.
తన కుటుంబం ఆత్మహత్యకు వనమా రాఘవేంద్ర కారణం అని రామకృష్ణ సెల్ఫీ వీడియోలో ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, తన అక్కతో వనమా రాఘవకు అక్రమ సంబంధం ఉందని తెలిపారు. ఈ నెల 3న భదాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో రామకృష్ణ తన భార్య, పిల్లలతో ఆత్మహత్య చేసుకున్నారు. భార్య, కుమార్తెలపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన రామకృష్ణ.. తను కూడా నిప్పు అంటించుకున్నాడు. ఈ ఘటనలో రామకృష్ణ, ఆయన భార్య లక్ష్మి, పెద్ద కూతురు సాహిత్య స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోగా చిన్నకూతురు సాహితి తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.
రామకృష్ణ కుంటుంబం ఆత్మహత్య సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. వనమా రాఘవేంద్ర వేధింపుల కారణంగానే తన కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోటులో, సెల్ఫీ వీడియోలో బాధితుడు రామకృష్ణ ఆరోపించాడు. ఈ కేసులో వనమా రాఘవేంద్ర ఏ-2గా ఉన్నారు. ఏ-3గా తల్లి సూర్యావతి, ఏ-4గా సోదరి మాధవి ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital