అప్పుడూ, ఇప్పుడూ వారికి రామయ్యే అండగా ఉన్నాడు. పాలకులు మారారు, పార్టీలు మారాయి… కానీ, ఆ ఊరి పరిస్థితులు మాత్రం అస్సలు మారలేదు. ఏటా గోదావరిలో వరదలు వచ్చినప్పుడు ముంపునకు గురయ్యే గ్రామం కావడం.. పునరావాసం కోసం రామయ్య గుడిచుట్టూ గుడారాలు వేయడం ఇక్కడ కామన్ అయ్యింది. ఇదే విషయాన్ని ఇప్పుడు ఆ గ్రామస్తులు యాది చేసుకుంటున్నారు. తమకు తరతరాలుగా ఇదే పరిస్థితి ఎదురవుతోందని ఆవేదన చెందుతున్నారు.
వీఆర్ పురం, (ప్రభన్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా పోలవరం ముంపు మండలాల్లో అతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాడు, నేడు పునరావాస కేంద్రంగా మారింది. అక్కడి 260 అవాసాలకు ఈ గుట్ట మాత్రమే దిక్కు అవుతోంది. తమ తాతాముత్తాల కాలం నుండి (1952 1986) 70 అడుగులకు పైగా వరద వచ్చినా.. సమీపంలో ఉన్న కొండ పునరావాసంగా నిలిచింది.
పోలవరం ముంపు మండలం అయిన వరరామచంద్రపురానికి 5 కిలోమీటర్లు దూరంలో పవిత్ర ప్రసిద్ధిగాంచిన సీతారాముల ఆలయం శ్రీరామగిరి ఉంది. ఇక్కడ సుమారు 260 కుటుంబాలు వారు జీవిస్తున్నారు. ఏటా గోదావరి వరదలకు ఈ గుట్ట చూట్టు గుడారాలు వేసుకొని వరద తగ్గే వరకు కృష్ణా. రామా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
41 కంటుర్ లో ఈ గ్రామం మొదటి విడత ఖాళీ చేస్తే రాములోరి ఆలయం జలదిగ్బంధంలో ముంపులో ఉంటుంది. రేపో మాపో ఇక్కడి ప్రజలు పునరావాస కాలనీలకు వెలితే రామయ్య గుడి ఇక్కడే చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. మొత్తం మీద ఇంతకాలం ఇదే గుట్ట వరదల సమయంలో వారికి సురక్షిత పునరావాసంగా కొండంత అండ ఇస్తుందని గ్రామస్థులు చెబుతున్నారు.