Wednesday, November 20, 2024

భద్రాద్రిలో రాములోరి కల్యాణం ఇలా!

హిందువులకు ఆరాధ్యదైవం శ్రీరాముడు. నేడు శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా జరగనుంది. ఉదయం 10.30 గంటలకు స్వామివారి కల్యాణఘట్టం ప్రారంభం కానుంది. కరోనా నిబంధనల దృష్ట్యా భక్తులకు అనుమతిని నిరాకరించారు. మంత్రులు అల్లోల, పువ్వాడ అజయ్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రేపు శ్రీరాముని మహాపట్టాభిషేకం జరగనుంది. కోవిడ్‌ కారణంగా ప్రత్యేక పూజలు, తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు నిలిపివేశారు.

ప్రతి సంవత్సరం భద్రాచలంలో శ్రీరామనవమిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. రెండేళ్లుగా కరోనా వల్ల ఆ వైభోగం కనిపించట్లేదు. కరోనా కారణంగా గతేడాది సీతారాముల కల్యాణోత్సవాన్ని నిరాడంబరంగా జరిపారు. ఈసారి కూడా అలాగే నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. చైత్ర శుద్ధ నవమి సందర్భంగా నేడు శ్రీ సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి సంవత్సరం మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభిత కల్యాణ వేదికలో ఈ వేడుకను జరిపేవారు. 2020లో మాత్రం లాక్‌డౌన్ కారణంగా తొలిసారి రామయ్య కల్యాణాన్ని అంతరంగికంగా నిత్యకల్యాణ మండపంలో జరిపారు. ఈసారి కరోనా సెకండ్‌వేవ్‌ ఉంది కాబట్టి… ఇవాళ కూడా నిత్య కల్యాణ మండపంలోనే ఈ వేడుకను ఎలాంటి హంగామా లేకుండా జరపబోతున్నారు. కరోనా ఎక్కువగా ఉంది కాబట్టి… ప్రభుత్వ ఆదేశాల ప్రకారం శ్రీరామ కల్యాణం నిరాడంబరంగా నిర్వహిస్తామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం సీతారాముల కల్యాణం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం అభిజిత్‌లగ్న సుముహూర్తాన రాములోరి కల్యాణాన్ని నిర్వహిస్తామని, కొవిడ్‌ నేపథ్యంలో ఆలయంలో ఆంతరంగికంగానే వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. శ్రీరామనవమి త్రిరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం యాగశాలలో ఆలయ ప్రధానార్చకులు నమిలకొండ ఉమేశ్‌శర్మ ఆధ్వర్యంలో హవనం నిర్వహించారు. శ్రీరామనవమి నవరాత్రోత్సవాల సందర్భంగా మంగళవారం శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారు, శ్రీ లక్ష్మీసమేత అనంతపద్మనాభ స్వామివార్ల ఉత్సవమూర్తులను నంది గరత్మంతుని వాహనంపై ఆలయంలో విహరింపజేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement