బీజేపీపై అసెంబ్లీ వేదికగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రె తీవ్రంగా విరుచుకుపడ్డారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన మంత్రి నవాబ్ మాలిక్ రాజీనామాను బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు. అసలు బీజేపీ జమ్మూ కశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీతో ఎందుకు పొత్తు పెట్టుకుందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. అంతేకాకుండా దావూద్ ఎక్కడుంటాడు? ఎవరికైనా తెలుసా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ గత ఎన్నికల్లో రామ మందిరం పేరు మీద ఓట్లు అడిగిందని, ఇప్పుడు ఆ సమస్య లేదు కాబట్టి.. దావూద్ పేరు మీద ఓట్లు అడగానికి రెడీ అయ్యిందా? అంటూ అసహనం వ్యక్తం చేశారు.
అమెరికా ప్రెసిడెంట్ అయిన ఒబామా అప్పట్లో ఇట్లనే లాడెన్ పేరు మీద ఓట్లు అడిగారా? అని ప్రశ్నించారు సీఎం ఉద్ధవ్. బీజేపీకి నిజంగా దమ్ముంటే దావూద్‌ను చంపేయాలని.. చంపేస్తారా? అని బీజేపీని ప్రశ్నించారు. నిజంగా మంత్రి నవాబ్ మాలిక్‌కు దావూద్ ఇబ్రహీంతో సంబంధాలుంటే.. ఇన్ని సంవత్సరాలుగా కేంద్ర దర్యాప్తు బృందాలు ఏం చేశాయని కేంద్రాన్ని సూటిగా నిలదీశారు. మంత్రి నవాబ్ మాలిక్‌కు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని, ఈ విషయం మాజీ సీఎం ఫడ్నవీస్‌కు కూడా తెలుసని ఉద్ధవ్ పేర్కొన్నారు.