ఢిల్లీలోని తెలంగాణ భవన్ దగ్గర టీఆర్ఎస్ నిర్వహించే మహాధర్నా కార్యక్రమంలో తాము కూడా పాల్గొంటామని రైతుసంఘం నేత రాకేష్ టికాయత్ తెలిపారు. టీఆర్ఎస్ ఛలో ఢిల్లీ కార్యక్రమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులన్నిటికీ కేంద్రం మద్దతుధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రం అవలంభించిన వ్యతిరేక విధానాల వల్ల దేశవ్యాప్తంగా రైతులకు నష్టం వాటిల్లుతోందని, మూడు చట్టాల విషయంలో కేంద్రం దిగివచ్చిందన్నారు. కానీ, నిరసనలో భాగంగా చనిపోయిన రైతులకు కేంద్రం ₹ 25 లక్షల నష్టపరిహారం చెలించాలని రాకేష్ టికాయత్ డిమాండ్ చేశారు.
దేశమంతా ధాన్యం సేకరణ విషయంలో దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండాలన్నారు రైతు సంఘాల నేత రాకేశ్ టికాయత్. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు చాలా బాగుందని కొనియాడారు. అట్లాంటి పథకం దేశానికే ఆదర్శమని రాకేష్ అన్నారు. తెలంగాణ తరహాలో అన్ని రాష్ట్రాల్లో రైతుబంధును అమలుచేయాలని, దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత కరెంటు అందించాలని కేంద్రాన్ని కోరారు. ఉచిత కరెంటు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి అభినందనీయని ఆయన అన్నారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్తులో తలపెట్టే ఏ కార్యక్రమానికైనా తమ మద్దతు ఉంటుందని కిసాన్ నేత రాకేష్ టికాయత్ ప్రకటించారు.