Friday, October 18, 2024

Analysis | రాజ్యసభ ఎవ‌రికి ద‌క్కేనో.. ఏపీ నుంచి సజ్జల.. జస్టిస్ జాస్తి చలమేశ్వర్?

అమరావతి, ప్రభన్యూస్: రాజ్యసభ సీట్ల ఎంపిక‌ కోసం క‌స‌ర‌త్తు మొద‌ల‌య్యింది. తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార బీఆర్ఎస్ లో పోటాపోటీ నెలకొంది. అదే రీతిన ఏపీలో కూడా చాలామంది పోటీ పడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 6వ తేదీన జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. సామాజిక కోణంలో తమకు అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్లు భావిస్తుండగా.. ఇప్పటివరకు పార్టీ తరఫున రాజ్యసభ పదవులు దక్కని వారూ ఆశగా ఎదురుచూస్తున్నారు. బీఆర్ ఎస్ అధినే కేసీఆర్, వైఎస్సార్‌సీపీ చీఫ్ జగన్ నిర్ణయం కోసం ఆశావ‌హులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

నిజామాబాద్ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే సీఎం కేసీఆర్ ఆలోచనే ఎలా ఉంద‌న్న‌ది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీ రామారావు సీఎం అవుతారా? లేక‌.. క‌ల్వ‌కుంట్ల‌ కవిత రాజ్యసభకు వెళ్తారా? ఈ ప‌రిణామాల‌పై పార్టీలోని మ‌రో కీల‌క నేత హ‌రీశ్‌రావు ఎలా స్పందిస్తారు? అనే దానిపై బీఆర్ ఎస్ కార్యకర్తల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్ తన త‌ర‌పున ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు యత్నాలకు నమ్మకమైన వారి కోసం అన్వేషిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక‌.. రాజ్యసభ సీటు భర్తీ సామాజిక కోణంలోనే ఉంటుందని, బీఆర్ఎస్ ముఖ్యులు భావిస్తున్నారు. ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి ఆ అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని అంటున్నారు. బీసీలకు అవకాశం ఇస్తే సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య పేర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో భర్తీ చేయాలని భావిస్తే సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్లు పరిశీలించ‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఎస్సీల్లోనే మాలలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే, టీఎస్ఐఐ సి చైర్మన్ గాదరి బాలమల్లు, ఎస్టీ అయితే సీతారాంనాయక్ పేరు ఉండొచ్చని అంటున్నారు. అనూహ్యంగా ఒక పారిశ్రామికవేత్తను టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు పంపాలనుకుంటే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేరు పరిశీలించవచ్చన్న చ‌ర్చ జ‌రుగుతోంది.

ఏపీ నుంచి ఎవ‌రికి చాన్స్ ఉంటుందో!
ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ స్థానాలు ఎవరికీ కేటాయించాలని ఇన్నాళ్లు చర్చించిన అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారి జాబితా సిద్ధమైనట్టు సమాచారం. కీలకమైన పదవులు కావడంతో పార్టీ నమ్ముకున్నోళ్లు, తమకు అండగా నిలబడిన వ్యక్తులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది. మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేరు కూడా గ‌ట్టిగానే వినిపిస్తోంది.

ఈ జాబితా ఫైనలైనట్టు తెలుస్తోంది. తన సొంత మీడియా సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో ఉన్నారు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే జగన్ కు రాజకీయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత సజ్జలను పార్టీలోకి ఆహ్వానించి పెద్ద పదవే ఇచ్చారు. విజయ సాయిరెడ్డి తర్వాత జగన్ కు అత్యంత నమ్మకస్తుడు సజ్జలనే. ఆయన పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుడిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ తన తోడు ఉండడంతో ఆయనను రాజ్యసభకు జగన్ పంపించనున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. గతంలో ప్రకాశం ఎంపీగా సుబ్బారెడ్డి పని చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే న్యాయం జరుగుతుందనే భావనలో జగన్ ఉన్నారంట. అనూహ్యంగా రాజ్యసభకు పంపే జాబితాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఉండడం గమనార్హం. అనంతపురం జిల్లాకు చెందిన రఘువీరారెడ్డికి పిలిచి మరి రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. యాదవ సామాజికి వర్గానికి చెందిన రఘువీరారెడ్డి జగన్ తండ్రి వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉంది.

అయితే రఘువీరారెడ్డి కాకుంటే మరొకరిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారంట. కృష్ణా జిల్లా కి చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందంట. ఎందుకంటే తరచూ జగన్ న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. చలమేశ్వర్ సేవలు వినియోగించుకుంటే జగన్ సేఫ్ గా ఉండడంతో పాటు న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement