జైసల్మార్ – కొద్ది రోజులుగా రాజస్థాన్ రాష్ట్రాన్ని కుదిపివేసిన అకాల వర్షాలు, ఉరుములు శాంతించాయి. అంతలోనే రాష్ట్రంలో మరో ప్రకృతి విపత్తు మొదలైంది. ఇప్పటికే మండ ఎండలకు ఉడికిపోతున్న రాజస్థానీలను తాజాగా ఇసుక తుఫాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మంగళవారం సాయంత్రం రాష్ట్రంలోని బార్మర్ నగరంలో కనిపించిన ఇసుక తుఫాను ఇళ్లను ధ్వంసం చేస్తుందా అన్నట్లుగా అంతెత్తున దూసుకువచ్చింది. ఆకాశాన్ని తాకినట్లున్న దాదాపు 70 నుంచి 80 అడుగుల ఎత్తులో ఇసుకతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది.
ఈ ఇసుక సుడిగాలి క్రమంగా పెద్దదవుతూ వచ్చింది. ఆ తర్వాత ఈదురు గాలులు వీయడంతో చుట్టుపక్కల ప్రాంతమంతా ఇసుక వ్యాపించింది. ఇసుక తుఫాను ఎంత భయంకరంగా ఉందో వీడియోలో చూడవచ్చు. ఆకాశాన్నంతా తన గుప్పిట్లోకి తీసుకున్నట్టు ముంచుకొచ్చింది. తుఫాను కారణంగా ఆకాశం బూడిద రంగులోకి మారి, సూర్యకాంతి మసకబారింది. భయంకర రీతిలో మరింత ముందుకు దూసుకుపోతుందని స్థానికులు చెబుతున్నారు.
అనుకోని నష్టం
దీని కారణంగా జనజీవనం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. దాదాపు 80 అడుగుల ఎత్తున ఎగిసిపడిన ఇసుక తుపాను కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ నష్టం వాటిల్లింది. గ్రామీణ ప్రాంతాల్లో కచ్చా ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. డిస్కమ్‌లకు కూడా కోట్లలో నష్టం వాటిల్లింది. గత నెల రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, తుఫానుల కారణంగా రాజస్థాన్‌లో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. వర్షం, తుపాను కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అంతే కాకుండా విద్యుత్ వ్యవస్థకు చాలా నష్టం వాటిల్లింది. ఇప్పుడు తాజా ఇసుక తుఫాను ఆ నష్టానికి తోడైంది.
ఇసుక తుఫానుకు కారణం
ఎడారిలో వాతావరణ పీడనం చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటివి వస్తాయని చెబుతున్నారు. సూర్యుని ప్రత్యక్ష కిరణాలు గాలిలోని తేమను నాశనం చేస్తాయి. దీని కారణంగా ధూళి కణాలు ఒకదానితో మరొకటి కలవలేవు. అటువంటి పరిస్థితిలో ధూళి కణాలు సుడిగాలి రూపంలో ఎగురుతాయని చెబుతున్నారు.
కాగా, పాకిస్థాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న జైసల్మేర్ నుంచి తలెత్తిన ఈ ఇసుక తుపానును పలువురు తమ కెమెరాల్లో బంధించి నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇటువంటి తుఫాన్లు మరిన్ని పొంచి ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.