Wednesday, November 20, 2024

రాజాసింగ్‌ ఓ రౌడీ షీటర్‌, మత విద్వేషాలను రెచ్చగొట్టడమే అతని లక్ష్యం.. హైకోర్టుకు వివరించిన అడ్వకేట్‌ జనరల్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఓ ప్రముఖ రౌడీ షీటర్‌ అని, మత విద్వేషాలను రెచ్చగొట్టడమే అతని లక్ష్యం అని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) వివరించారు. ఎంఎల్‌ఏ రాజాసింగ్‌పై నమోదైన పిడీ యాక్టు తీసివేసి ఆయనకు స్వేచ్ఛకలిగించాలని రాజాసింగ్‌ భార్య ఉషాభాయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. మొహమ్మద్‌ ప్రవక్త పై ఎంఎల్‌ఏ రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు వాస్తవమని దానికి సంబంధించిన వీడియోలు ఆధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయని కోర్టుకు ఏజీ వివరించారు.

రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలతో హైదరాబాద్‌ సహా తెలంగాణ ప్రాంతంలో మత ఘర్షణలు చెలరేగాయని హైకోర్టుకు ఏజీ వివరించారు. రాజాసింగ్‌పై 100కు పైగా కేసులు నమోదైఉన్నాయని రెండు మర్డర్‌ కేసుల్లోను కూడా రాజాసింగ్‌ నిందితుడని కోర్టు దృష్టికి తీసుకుని వెళ్లారు. అసలు రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలతో విసుగుచెందిన సొంత బిజెపినే ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్‌ చేసిందని తెలిపారు. రాజాసింగ్‌ కేసులను క్షుణ్ణంగా పరిశీలించిన డిటెన్షన్‌ ఆథారిటీ బయటకు వస్తే ఏం జరుగుతుందో గమనించి నివేదిక ఇచ్చిందని హైకోర్టుకు ఏజీ విన్నవించారు.

ఇలా రాజా సింగ్‌కు సంబంధించిన పలు అంశాలను సుమారు రెండు గంటల పాటు అనర్ఘళంగా వాదించిన ఏజీ ఎంఎల్‌ఏ రాజీసింగ్‌ బయటకు వస్తే శాంతియుత సమాజ వాతావరణానికి విఘాతం కలుగుతుందని కోర్టుకు విన్నవించారు. కాగా బుధవారంం నాటికి సమయం అయిపోవడంతో ఈ కేసును హైకోర్టు ధర్మాసనం నేటికి వాయిదా వేసింది. కాగా మమ్మద్‌ ప్రవక్తపై తన క్లయింట్‌ ఎంఎల్‌ఏ రాజాసింగ్‌ ఎలాంటి ఆరోపణలు చేయలేదని ఎంఎల్‌ఏ రాజాసింగ్‌ తరఫు న్యాయవాది ఆయన తరఫున వాదిస్తూ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.

- Advertisement -

మహ్మద్‌ ప్రవక్తను చెడుగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలోఓ రాజాసింగ్‌ పోస్టు చేశారనే అభియోగాలకు ఆధారమైన ట్రాన్స్‌లేషన్‌ చేసిన వ్యక్తి ఎవరో పోలీసులు ఇంత వరకు వెల్లడించలేదని వివరించినట్లు చెబుతున్నారు. రాజీకీయ కుట్రలో భాగంగానే రాజాసింగ్‌పై పిడీ యాక్టు నమోదు చేశారని, దాన్ని రద్దు చేయాలని కోరుతూ ఎంఎల్‌ఏ భార్య టి. ఉషాభాయ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయాన్ని ఈ సంందర్భంగా గుర్తు చేసినట్లు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement