హైదరాబాద్, ఆంధ్రప్రభ: యాసంగి కోసం రైతుబంధు పంట పెట్టుబడి సాయాన్ని డిసెంబర్ 28వ తేదీ నుండి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ప్రారంభించిన వారం పది రోజుల్లో గతంలో మాదిరిగానే, వరుస క్రమంలో అందరి ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవుతాయని తెలిపారు. నిన్న ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన అన్ని జిల్లాల కలెక్టర్లతో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో దళిత బంధు అమలు పురోగతి తీరు తెన్నులు రాష్ట్రవ్యాప్తంగా అమలు కోసం చేపట్టవలసిన చర్యలు, యాసంగి వరి ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ., ఉద్యోగుల జోనల్ పంపిణీ, రైతుబంధు నిధులు విడుదల., కరోనా పరిస్థితి ఒమిక్రాన్ వ్యాప్తి అంశాలపై విస్తృతస్థాయిలో సమీక్షించారు. ఈ ఉన్నతస్థాయి కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర మంత్రులు, అందుబాటులో వున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా సీఎంవో అధికారులు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తర తరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేయడమే ‘దళితబంధు’ పథకం లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. నూరుశాతం సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.10 లక్షల ద్వారా దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతంగా పటిష్టం చేయడంలో కీలకపాత్ర వ#హంచి, దళిత బంధు’ సామాజిక పెట్టుబడిగా మారుతుందని సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంవో అధికారులు నర్సింగ్ రావు, స్మితా సబర్వాల్, రా#హుల్ బొజ్జా, భూపాల్ రెడ్డి, ప్రియాంక వర్గీస్‌లు పాల్గొన్నారు. వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎస్సీ కార్పొరేషన్ ఎం.డి. అశోక్ కుమార్, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఎఏం రిజ్వీ, స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్స్ ఐజీ శేషాద్రి, సివిల్ సప్లయీస్ కమిషనర్ అనిల్ కుమార్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గంగాధర్, శ్రీనివాసరావు, రమేశ్ రెడ్డి, అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
వానాకాలం పంటలకు ముందస్తు ప్రణాళికలు సిద్దం చేయండి
రాబోయే వానాకాలం పంటల సాగు కోసం ఏ ఏ పంటలు వేయాలో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రికి అధికారులకు సీఎం ఆదేశించారు. వానా కాలంలో ప్రధానంగా మూడు పంటలపై దృష్టి సారించా లన్నారు. పత్తి, కంది, వరి సాగుపై దృష్టి సారించేలా చూడాలని కలెక్టర్లను, వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రైతాంగాన్ని ప్రత్యామ్నాయ లాభసాటి పంటల సాగుదిశగా సమాయత్తం చేయాలన్నారు.
సంతృప్తస్థాయిలో దళితబంధు
హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు ఇప్పటికే ప్రకటించిన నాలుగు జిల్లాల నుంచి నాలుగు మండలాల పరిధిలో దళిత బంధును ముందుగా ప్రకటించిన విధంగానే సంతృప్త స్థాయిలో అమలు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. నిధులను త్వరలోనే విడుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన విధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో వంది మంది లబ్ధిదారులను ఎంపిక చేసి అమలు చేసే కార్యాచరణను ప్రారంభిం చాలని కలెక్టర్లను, అధికారులను సీఎం కేసీఆర్ అదేశించారు. ఇందుకుగాను స్థానిక ఎమ్మెల్యేల సూచనలు తీసుకోవాలన్నారు.