హైదరాబాద్, రాష్ట్రంలో రాగల ఐదు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాతావరణంలో నెలకొన్న అనిశ్చితి, ద్రోణి ప్రభావంతో ఏర్పడిన క్యూములోనింబస్ కారణంగా భారీ వర్షాలు పడతాయని వివరించింది. గురువారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మోస్తరు వర్షాలు, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
సాధారణంగా వానకాలం సీజన్‌లోనే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. కానీ ఈ ఏడాది వేసవి సీజన్ ప్రారంభం నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో కురుస్తున్నాయి. దక్కన్ పీఠభూమి ప్రాంతం కావడం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆవర్తన ద్రోణులు ఏర్పడటం, మరఠ్వాడ ప్రాంతం సమీపంలో ఉండటం వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వాటి ప్రభావంతో వేసవిలో అధిక వర్షపాతం నమోదవుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. మార్చి 1 నుంచి ఏప్రిల్ 26 వరకు సాధారణ వర్షపాతం కంటే అన్ని జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్టు వివరించారు