తెలుగు రాష్ట్రాల రైతులకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి రాగల మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర,యానాం, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఝార్ఖండ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్ వరకు 1.5 కిమీల ఎత్తు వరకు ఉపరితల ద్రోణిగా ఏర్పడింది. దీని ప్రభావంతో నేటి నుంచి ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రా, యానాంలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు, రాయలసీమలో రేపటినుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇక, నైరుతి రుతుపవనాల కదలిక మందకొడిగా ఉంది.
మరోవైపు తెలంగాణలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు, ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయినా.. సరిపడా వర్షాలు లేక రైతులు ఆందోళనకు గురయ్యారు. పంటలపై ఆశలు వదిలేసుకునే సమయంలో వరుణుడు కరుణించాడు. ఒకసారిగా రైతుల ముఖాల్లో సంతోషాన్ని నింపాయి.